రేవంత్​లో గుణాత్మక మార్పు..

రేవంత్​లో గుణాత్మక మార్పు..

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన కొత్తలో దూకుడు కనపడింది. వరుసగా సభలు సమావేశాలు పెట్టి కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే ప్రయత్నం చేశారు. ఇంద్రవెల్లి సభ, గజ్వేల్ సభ, వరంగల్ రైతు డిక్లరేషన్ తో కాంగ్రెస్ లో జోష్ నింపారు. దీంతో పార్టీలో ఆయన ఒంటెద్దు పోకడలు పోతున్నారన్న విమర్శలు ఆయనను వెంబడించాయి. కొంతమంది నేతలు బాహాటంగా బయటికి వచ్చి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసే ప్రయత్నం చేశారు.   అంతర్గత కుమ్ములాటలతో అమాంతం పార్టీ ప్రతిష్ట ప్రజల్లో దిగజారింది. ప్రజలు సైతం కాంగ్రెస్ వాళ్ల కొట్లాటలు చూసి అసహ్యించుకునేవారు.  రాజగోపాల్ రెడ్డి పార్టీ వదలడం, మునుగోడు ఉప ఎన్నిక రావడం, ఆ ఎన్నికల్లో చాలా మంది నేతలు సహకరించకపోయినా కనీసం గౌరవంగా ఓట్లు తెచ్చుకోవాలన్న ప్రయత్నంతో 25 వేల ఓట్లు సాధించారు. దీంతో బీజేపీ ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి మొదటి లాగ దూకుడుతో కాకుండా అధిష్టానం ఆదేశాలు శాసనంగా, సీనియర్లను కలుపుకొని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటాలతో అందరివాడుగా మారారు.

పాదయాత్రలు, యూత్ డిక్లరేషన్​

మునుగోడు ఉప ఎన్నిక వల్ల రాజ గోపాల్ రెడ్డి ఎపిసోడ్ తో పాటు, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ పై ఆరోపణలు వచ్చాయి.  సీనియర్లు అంతా భట్టి విక్రమార్క నివాసంలో సమావేశం కావడంతో  కాంగ్రెస్ లో పరిస్థితి కకా వికలంగా మారింది. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడు గా మార్చాలని సీనియర్ల డిమాండ్ తో కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ రాజకీయం.. రాష్ట్ర ఇంచార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే నియామకం తదుపరి పరిస్థితి మారింది. తన విరోధులు సైతం ఆశ్చర్య పోయేలా రేవంత్  కేసీఅర్​ను గద్దె దించడమే టార్గెట్ గా చేసే పోరు బాటలో సీనియర్లు సైతం కలసి రావాల్సిన పరిస్థితి కల్పించాడు. సీనియర్లు సైతం రేవంత్ కమిట్ మెంట్, కలుపు గోలు తనం పార్టీ పట్ల అంకితభావంతో ఫిదా అయిపోయారు. 

పార్టీ అధిష్టానం అనుమతితో  పాదయాత్ర మొదలుపెట్టి  అందర్నీ పాల్గొనేలా ప్రయత్నం చేశారు. మధ్యలో కొంతమంది నాయకులు కొంత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా  తన పాదయాత్రను కొనసాగించారు. మరోవైపు భట్టి సైతం నేను పాదయాత్ర చేస్తానని  ఇన్చార్జిని అడగగా.. పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఆమోదించారు. ఇక్కడే రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ పరిణతి కనబడింది. ఒకవేళ భట్టి విక్రమార్క పాదయాత్రను వ్యతిరేకించి ఉంటే.. తాను అభద్రతతో ఉన్నాడని భావించేవారు. మరోవైపు తన పాదయాత్ర ముగించుకొని భట్టి  పాదయాత్రలో ఎక్కడ సభలు సమావేశాలు పెట్టుకున్నా దానికి పూర్తి సహకారం అందించి ఆ సమావేశంలో పాల్గొన్నారు. భట్టి పాదయాత్ర సాగుతుండగానే .. టీఎస్.పీ.ఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూని హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ అందరి నేతలను ఇన్వాల్వ్​ మెంట్ చేస్తూ యువగర్జన సమావేశాలు పెట్టి ప్రియాంక గాంధీ  ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ కార్యక్రమం చేశారు.   

అందరివాడిలా..

పార్టీ టికెట్లు నా చేతిలో లేవు అంతా హై కమాండ్ సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తారని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఈ వర్గం, ఆ వర్గం కాదు ఎవరు గెలుస్తారో వారే నా వర్గం అనే విధంగా తన నడవడిక కనబడుతున్నది. నా టికెట్ సైతం నాకు గ్యారెంటీ లేదు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను అంటూ.. కర్ణాటక ఉదాహరణ కూడా ఆయన చెబుతున్నారు.  సిద్ధరామయ్యను  కూడా ఎక్కడినుంచి పోటీ చేయాలో  హైకమాండ్ డిసైడ్ చేసింది.   

చేరికలపై..

ఇక పార్టీలో చేరికలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఎటువంటి వివాదం లేకుండా తాను ఒక్కడే కాకుండా పార్టీలో సీనియర్ల అభిప్రాయాలు తీసుకొని, ఒప్పించి అధిష్టానం ను ఒప్పించి పార్టీలోకి తీసుకొస్తున్నారు. అది పెద్ద నేతలు అయితే నియోజకవర్గం, ఆ జిల్లాలో ఉన్న నేతలతో సంప్రదించి పీసీసీ స్థాయిలో చేరికలు చేసుకుంటున్నారు. ఉదాహరణకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి, దామోదర్ రెడ్డి నేతలు చెప్పుకోవచ్చు. పార్టీలోకి ఎవరైనా బలమైన నేతలు రావాలనుకుంటే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉన్నా , మీరు నేరుగా హై కమాండ్ తో చర్చించి పార్టీలోకి రావచ్చని కూడా ఓపెన్ గా ప్రకటించడం ఆయనలో వచ్చిన మార్పును సూచిస్తున్నది.  ఈ విధంగానే  పార్టీ సారథిగా  విజయ తీరాలకు  తీసుకెళ్తే ,  కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయనొక మారిన  మహర్షి అనే చెప్పొచ్చు. 

హై కమాండ్​ భరోసా!

నల్లగొండలో ఎప్పుడూ పెద్ద సభలు పెట్టని రేవంత్ రెడ్డి అక్కడ మీటింగ్ పెట్టాలని భావించారు. కానీ అక్కడ మీటింగ్ పెట్టే క్రమంలో  తేదీపైన వివాదం నెలకొంది.  దాన్ని వెంటనే వాయిదా వేసుకుని నల్లగొండ నేతలనే మీటింగ్ డేట్​ ఫిక్స్​ చేయమని చెప్పారు. వారి అనుమతితో వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా అందరు నేతలను కలుపుకుంటూ మీటింగు సక్సెస్ చేయగలిగారు. ఇది మా బలగం అంటూ ఐక్యాన్ని చాటారు. 

పార్టీలో నిత్యం తనను విమర్శించే నేతలు సైతం తనతో కలిసి వచ్చేలా కలుపుకొని పోయారు. అంటే అసలు రేవంత్ రెడ్డి లో ఇంత గుణాత్మక మార్పు ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉన్న ఆంతర్యమేంటి అంటే పార్టీ హై కమాండ్  ఆదేశాలతో రేవంత్ క్రమశిక్షణ గల నేతగా ఆ  అవకాశాన్ని ఉపయోగించు కోవడంలో సక్సెస్ అయ్యారు. ఒకవేళ అధికారంలోకి వస్తే పీసీసీ అధ్యక్షుడిగా తానే ముఖ్యమంత్రి అవుతానన్న ఆశ ఆయనలో కలిగి ఉండాలి. ఇవేవీ కారణాలు లేకుండా ఒక వ్యక్తిలో ఇన్ని గుణాత్మక మార్పులు ఉండవు. ఫైనల్ గా  అందరిని కలుపుకొని ముందుకు సాగండి, అధికారం ఏంది,  అప్పుడు మీకే మొదటి అవకాశం ఉంటుందని హై కమాండ్ సూచన చేసి ఉండాలి. 

– బోదనపల్లి వేణుగోపాల రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు