ఈ దొంగ గురించి తెలిసి పోలీసులే అవాక్క్ అయ్యారు.. స్పెషల్ ఏంటంటే..?

ఈ దొంగ గురించి తెలిసి పోలీసులే అవాక్క్ అయ్యారు.. స్పెషల్ ఏంటంటే..?
  •  వందకు పైగా చోరీలు.. డైరీలో వివరాలు
  • ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్న దొంగ
  • 15 రోజుల వ్యవధిలో మరో నాలుగు దొంగతనాలు
  • చోరీ జరిగిన విధానం ఆధారంగా నిందితుడు అరెస్ట్

ఓయూ, వెలుగు: వందకు పైగా దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని చోరీ విధానం చూసి పోలీసులు అవాక్కయయ్యారు. ఓయూ పీఎస్‎లో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి ఈ కేసు వివరాలను వెల్లడించారు. కర్నూల్ జిల్లా నాగర్లబండకు  చెందిన రత్లావత్ శంకర్ నాయక్ 2012లో గద్వాల్‎లో బీఫార్మసీ చదువుతుండగా, ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. 

అనంతరం చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఈజీమనీ కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్ల వద్ద పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి సమయాల్లో చోరీలు చేసేవాడు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాజేశ్ రెడ్డి, రంగారావు, లియాజాఖాన్ తదితర పేర్లతో చలామణి అయ్యాడు. 2022 సెప్టెంబర్‎లో మేడిపల్లి పరిధిలో చోరీకి పాల్పడి, పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్ట్​నమోదు చేశారు.

అయినా తీరుమార్చుకోకుండా పలుమార్లు జైలుకు వెళ్తూ దొంగతనాలకు పాల్పడ్డాడు. గత నెలలో జైలు నుంచి విడుదలైన శంకర్ నాయక్ తన వైఖరిని మార్చుకోకుండా 15 రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. వాటిలో ఓయూ, మియాపూర్ పీఎస్​ల పరిధిలో ఒకటి చొప్పున, పటాన్ చెరులో రెండు చోరీలు చేశాడు. హబ్సిగూడకు చెందిన రాంజీ తన ఇంట్లో 8 తులాల బంగారం చోరీకి గురికావడంతో ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు చోరీ జరిగిన విధానం, ఫింగర్ ప్రింట్లు సేకరించి శంకర్ నాయక్​ను నిందితుడిగా నిర్ధారించారు. బుధవారం ఉదయం ఎల్బీనగర్​లో సంచరిస్తుండగా, అతడిని అదుపులోకి ప్రశ్నించారు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి, 11 తులాల బంగారం, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. 

చీటీలో లేదంటే గోడలపై రాసి.. 

శంకర్ నాయక్ చోరీ విధానం చూసి పోలీసులు అవాక్కయయ్యారు. తాను చోరీ చేసిన చోట దొంగిలించిన వస్తువుల వివరాలను ఒక చీటీలో రాసి అక్కడ వదిలేవాడు. లేదంటే గోడపై రాసేవాడు. ఇలా అన్ని చోరీల వివరాలు, కొట్టేసిన వస్తువులను నిందితుడు తన డైరీలో ఎప్పటికప్పుడు రాసుకోవడం గమనార్హం. గతంలో ఒకచోట ఏమీ లభించకపోయినా అయిదు తులాల బంగారు ఆభరణాలు పోయాయని ఇంటి యజమాని ఫిర్యాదు చేయడం, పోలీసులు తన నుంచి రికవరీ చేయడంతో అప్పటి నుంచి నిందితుడు ఈ అలవాటు చేసుకున్నాడు.