వైన్స్‌‌‌‌లో చోరీకి వచ్చి తాగి పడుకుండు

 వైన్స్‌‌‌‌లో చోరీకి వచ్చి తాగి పడుకుండు

మెదక్, వెలుగు : వైన్స్‌‌‌‌లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. ఫుల్‌‌‌‌గా లిక్కర్‌‌‌‌ సేవించి అక్కడే పడుకుండిపోయాడు. ఉదయం గమనించిన ఓనర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మెదక్‌‌‌‌ జిల్లా నార్సింగిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నార్సింగిలోని కనకదుర్గా వైన్స్‌‌‌‌ యజమాని పర్శగౌడ్‌‌‌‌ ఆదివారం రాత్రి వైన్స్‌‌‌‌ క్లోజ్‌‌‌‌ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం వచ్చి వైన్స్‌‌‌‌ షటర్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేసి చూసేసరికే కాటన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి నిద్రపోయి కనిపించాడు. 

అతడి పక్కన ఉన్న సంచిలో మందుబాటిళ్లు, సీసీ కెమెరాలు, హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌ కనిపించడం, వైన్స్‌‌‌‌ పైకప్పు రేకులు తొలగించి ఉండడంతో ఆ వ్యక్తి చోరీకి వచ్చి ఉంటాడని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తి ఎంతకూ స్పృహలోకి రాకపోవడంతో 108లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చోరీకి వచ్చింది బీహార్‌‌‌‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.