- ముంబై, పుణెలో భారీగా ఆస్తులు
- ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన గజదొంగ
కోల్ కతా: అతను ఐదో తరగతి డ్రాపవుట్. కానీ, దేశంలోని 14 రాష్ట్రాల్లో 1200 సార్లు ఇండ్లకు కన్నాలు వేసి దొంగతనాలు చేశాడు. డబ్బు, బంగారు నగలు దొంగిలించి కోట్లకు పడగలెత్తాడు. గత 25 ఏండ్లుగా దొంగతనాలు, దోపిడీలే అతని వృత్తి. దొంగతనాలు ఎలా చేయాలో శిక్షణ ఇవ్వడం ప్రవృత్తి. ఇన్నేండ్లుగా తమను ముప్పు తిప్పలు పెట్టిన దొంగ నదీమ్ ఖురేషీ (45) ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం కోల్ కతాలోని సాల్ట్ లేక్ ఏరియాలో ఓ వ్యక్తి ఇంట్లో రూ.12 లక్షలు దొంగిలించి అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న అతడిని బెంగాల్ పోలీసులు దర్యాప్తు కోసం తీసుకెళ్లారు. 14 రాష్ట్రాల్లో దొంగతనాలు, దోపిడీలు, హత్యా యత్నాలకు పాల్పడిన నదీమ్.. ముంబై, పుణెలో కోట్ల విలువైన ఆస్తులను సంపాదించాడు. తన పిల్లలను ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తున్నాడు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. 2021లో కోల్ కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని పట్టుకున్న రాజస్థాన్ పోలీసులు.. ఘజియాబాద్ లో ఓ దొంగతనం కేసుకు సంబంధించి తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో ఉన్న నదీమ్ ను సాల్ట్ లేక్ లో దొంగతనానికి సంబంధించిన కేసులో దర్యాప్తు చేయడానికి బెంగాల్ పోలీసులు తీసుకెళ్లారు. అతడికి కోర్టు ఏడు రోజుల రిమాండ్ కు పంపింది.3
ALSO READ :గచ్చిబౌలిలో సెల్లార్ తవ్వకాలు.. కూలిన అపార్ట్మెంట్ల ప్రహరీగోడ
ఆఫీసర్ లా తయారై రెక్కీ నిర్వహించి
నదీమ్ ఖురేషీ దొంగతనం చేసే విధానం తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఖరీదైన కార్లలో ప్రయాణించి బిల్డింగుల వద్ద దిగేవాడు. లిఫ్ట్ లో బిల్డింగ్ పై అంతస్తు వరకూ వెళ్లి బిల్డింగ్ మొత్తం తిరిగి ఏయే ఇళ్లకు తాళం వేసి ఉందో పరిశీలించేవాడు. ఆ ఇండ్లను టార్గెట్ గా ఎంచుకొని కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడేవాడు. 2021లో బెంగాల్ లో కొన్నిసార్లు ఇలా దొంగతనాలు చేశాడు. ఇప్పటికే అతను 23 సార్లు అరెస్టయ్యాడు. అంతేకాకుండా నదీమ్ గ్యాంగ్ పేరుతో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని చోరీలు ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు.