దొంగలున్నారు జాగ్రత్త అంటూనే.. బంగారం దోచుకున్రు

దొంగలున్నారు జాగ్రత్త అంటూనే.. బంగారం దోచుకున్రు
  • ఒంటిపై ఉంటే ఎత్తుకెళ్తారని ఓ వ్యక్తిని నమ్మించిన యువకులు
  • పేపర్‌‌‌‌లో నగలకు బదులు రాళ్లు పెట్టి ఇచ్చిన వైనం

యాదాద్రి, వెలుగు : ‘దొంగలు తిరుగుతున్నారు.. ఒంటిపై ఉన్న నగలను సైతం దోచుకుపోతున్నారు.. జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పిన యువకులే ఓ వ్యక్తిని నమ్మించి పట్టపగలే, నడిరోడ్డుపై బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన వృద్ధుడు పులిగిళ్ల బాలరాజు మంగళవారం ఆలేరు బస్టాండ్‌‌‌‌లో బస్సు దిగాడు. రైల్వే స్టేషన్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌లో ఉన్న తన మోపెడ్‌‌‌‌ తీసుకునేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.

 రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలోకి రాగానే టూ వీలర్‌‌‌‌పై ఉన్న ఇద్దరు యువకులు బాలరాజును పిలిచారు. దీంతో అతడు రోడ్డు దాటి అవతలి వైపునకు వెళ్లి యువకులను కలిశాడు. ఆలేరులో దొంగలు తిరుగుతున్నారని, ఒంటిపై ఉన్న నగలను సైతం దోచుకెళ్తున్నారని, వాటిని వేసుకోవద్దని అందరికీ చెబుతున్నామంటూ నమ్మబలికారు. దీంతో బాలరాజు తన మెడలో ఉన్న చైన్‌‌‌‌, వేలికి ఉన్న రెండు బంగారు ఉంగరాలను తీసి నిక్కర్‌‌‌‌ జేబులో వేసుకున్నాడు.

 అలా ఉన్నా దొంగలు కొట్టేస్తారంటూ చెప్పిన యువకులు చైన్‌‌‌‌, ఆభరణాలను తీసుకొని ఓ పేపర్‌‌‌‌లో చుట్టి ఇచ్చారు. దానిని తీసుకున్న బాలరాజు వెంటనే విప్పి చూడగా రాళ్లు కనిపించాయి. దీంతో వారిద్దరిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు టూవీలర్‌‌‌‌పై రాంగ్‌‌‌‌రూట్‌‌‌‌లో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాలరాజు వివరాలు అడిగి తెలుసుకున్నారు.