బెంగళూరు: సినీ నటితో ప్రేమాయణం. ఆమెకు గిఫ్ట్గా కోల్కత్తాలో రూ.3 కోట్ల ఖరీదైన ఇల్లు కొనిచ్చేంత చనువు. ఆ ఇంట్లోకి 22 లక్షల ఖరీదైన అక్వేరియం బహుమతిగా ఇచ్చేంత లగ్జరీ లైఫ్. ఇదీ బెంగళూరులోని ఒక ఇంట్లో 14 లక్షల విలువైన బంగారం, వెండి నగలు కాజేసి పోలీసులకు దొరికిపోయిన ఒక దొంగ క్రిమినల్ హిస్టరీ. ఈ చోర శిఖామణి లగ్జరీ లైఫ్ గురించి తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయిన పరిస్థితి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కాస్టీ దొంగ బాగోతం వెలుగుచూసింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పంచాక్షరి ఎస్ స్వామి అనే వ్యక్తి స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్. ప్రస్తుతం అతని వయసు 37 సంవత్సరాలు. 2003లో దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈజీ మనీకి అలవాటు పడి.. దొంగతనాల్లో ఆరితేరి 2009 నాటికి దొంగతనాన్నే తన వృత్తిగా ఎంచుకున్నాడు. ధనవంతుల ఇళ్లనే టార్గెట్ చేసి దొంగతనాలు చేశాడు. దొంగతనాలు చేసి కోట్లు కూడబెట్టాడు. 2014-15 ఆ టైంలో తన దగ్గర ఉన్న కోట్ల డబ్బుతో లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తుండగా అతనికి ఒక సినీ నటి పరిచయమైంది. స్వామి లగ్జరీ లైఫ్ చూసి ఆ యువతి కూడా ఇతనికి దగ్గరైంది. ఇద్దరూ ప్రేమాయణం సాగించారు.
Also Read ;- ష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ
ఈ ప్రేమ ఎంతదాకా వెళ్లిందంటే.. కోల్కత్తాలో 3 కోట్ల ఖరీదైన విల్లాను ఆమెకు ఈ దొంగ గిఫ్ట్ గా ఇచ్చేంతలా ఈ రొమాంటిక్ రిలేషన్ కొనసాగింది. ఆ ఇంట్లో 22 లక్షల అక్వేరియం కూడా ఈ దొంగ డబ్బుతోనే కొన్నారు. దొంగతనాలు చేసుకుంటూ, పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ హ్యాపీగా హీరోయిన్తో లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న స్వామికి 2016లో ఎదురుదెబ్బ తగిలింది. 2016లో గుజరాత్ పోలీసులు ఈ దొంగను అరెస్ట్ చేశారు. ఆరేళ్లు సబర్మతి సెంట్రల్ జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో దొంగతనం కేసులో మహారాష్ట్ర పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర జైలు నుంచి విడుదైన తర్వాత కొన్నాళ్లు దొంగతనాలకు దూరంగా ఉన్నాడు. 2024లో ఈ పంచాక్షరి ఎస్ స్వామి తన మకాం మార్చేశాడు. బెంగళూరులో మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. బెళగావి పోలీస్ స్టేషన్ లో ఇతనిపై కేసు కూడా నమోదైంది.
స్త్రీ లోలుడైన ఈ దొంగ మహిళలతో సంబంధాల కోసం వెంపర్లాడిపోయేవాడు. పెళ్లయి భార్య, పిల్లలు ఉన్నా గర్ల్ ఫ్రెండ్స్తో గడిపేవాడు. ఈ దొంగ కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా. పలువురు చిన్న సినిమా హీరోయిన్స్తో ఇతనికి సంబంధాలు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ.. దొంగ సొమ్ముతో వైభోగం ఎల్లకాలం సాగదుగా. బెంగళూరులోని మారుతి నగర్లో జనవరి 9న 14 లక్షల విలువైన నగలు దొంగతనం చేసిన కేసులో ఈ గజ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. 20 ఏళ్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసి.. ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడిపిన పంచాక్షరి ఎస్ స్వామి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి మరీ ఈ గజదొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక గన్ తో పాటు 181 గ్రాముల బంగారం, 33 గ్రాముల వెండి ఆభణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.