- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)ను గెలిపిస్తే.. రాష్ట్రంలోని నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వారధిగా పనిచేస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో బుధవారం రాత్రి సీఎం రేవంత్ తన నివాసంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం తీరును, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించారు.
ఈ ఉప ఎన్నికను పార్టీ నేతలు, క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ ఇన్‌చార్జిలు బూత్ స్థాయిలో ప్రచారాన్ని సమీక్షించాలని కోరారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తున్నందున గ్రౌండ్ లెవల్‌లో పార్టీ నేతలు, క్యాడర్ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలింగ్ రోజున ప్రతి ఎమ్మెల్యే తన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌ను సందర్శించాలని సూచించారు.
ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక కాదని, కాంగ్రెస్ ఎన్నికగా ప్రతి నాయకుడు, కార్యకర్త గుర్తించి గెలుపు కోసం కష్టపడాలన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని చెప్పారు.