బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

సికింద్రాబాద్, వెలుగు: లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్​ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్​రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.

సోమవారం ఆలయం వద్ద నిర్వహించిన అంబారీ ఊరేగింపు, రంగం కార్యక్రమంలోనూ భక్తులు భారీగా పాల్గొన్నారు. ఇదే అదునుగా రెండు రోజులు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తుల నుంచి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, నగదు, 25 సెల్​ఫోన్లు, రెండు బైకులు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు  మహంకాళి, మోండా మార్కెట్​పోలీస్​స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం అమ్మవారి దర్శన కోసం క్యూలైన్ లో వేచి ఉన్న మహిళ మెడలోని ఒకటిన్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.

ఓ న్యూస్​రిపోర్టర్​తన భార్యతో కలిసి అమ్మవారిని దర్శించుకుని బయటికి వచ్చే గ్యాప్​లో అతని భార్య సెల్​ఫోన్​కొట్టేశారు. మరో రిపోర్టర్​ఆలయంలోని భక్తుల రద్దీని పరిశీస్తుండగా అతని జేబులోని రూ.4 వేలు చోరీ చేశారు. సోమవారం అంబారీ, ఫలహార బండ్ల ఊరేగింపులోనూ దొంగల చేతివాటం చూపించారు. మహిళ మెడలోని బంగారు ఆభరణాలు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 1,500 మంది పోలీసుల బందోబస్తు, 100 సీసీ కెమెరాల నిఘా ఉన్నా దొంగలు చోరీలకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది.