తాళం వేసిన ఇండ్లే టార్గెట్.. నెలలోనే 118 చోరీలు

  •     తాళం వేసిన ఇండ్లే టార్గెట్
  •     పార్కింగ్​ చేసిన బండ్లూ మాయం
  •     బోర్డులతోనే సరిపెడుతున్న పోలీసులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇండ్లు, పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేస్తున్నారు. దొంగతనాలు పెరిగిపోతున్నా.. పోలీసుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి.

ఆగని దొంగతనాలు..

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 52 స్టేషన్లు.. 3వేలకు పైగా పోలీస్​సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో సగం మంది పోలీసులు కేవలం వరంగల్ ట్రైసిటీలోనే డ్యూటీ చేస్తున్నారు. దొంగతనాలు, నేరాల నియంత్రణకు సిటీలో 20వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. రోజూ రెండు, మూడు చోరీల కేసులు సిటీలో నమోదవుతున్నాయి. తాళం వేసిన ఇండ్లలో చొరబడి బంగారం దోచేస్తున్నారు, ఖరీదైన బైకుల్ని మాయం చేస్తున్నారు. ఒక్క నవంబర్ నెలలోనే వరంగల్ సిటీలో 118 చోరీ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ, కాజీపేట, హనుమకొండ, మిల్స్​కాలనీ, మట్వాడా, ఇంతేజార్ గంజ్, సుబేదారి పోలీస్ స్టేషన్ ల పరిధిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. నగరం నడిబొడ్డునే చోరీలు జరుగుతుండడం కలవరానికి గురి చేస్తున్నాయి.

నార్త్ దొంగలే ఎక్కువ..

చోరీ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో ‘నార్త్’ నుంచి వచ్చిన వారే ఎక్కువగా పట్టుబడుతున్నారు. కూలి, వంట పనులకు వచ్చి, అందరినీ నమ్మించి ప్లాన్ ప్రకారం దొంగతనం చేస్తున్నారు. దొరిగిన వారి డాటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ కు చెందిన గ్యాంగులున్నాయి. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా.. పెట్రోలింగ్​ను పెంచడం లేదు. నామమాత్రంగా బోర్డులు పెట్టి, చేతులు దులుపుకొంటున్నారు.

భయాందోళనలో ప్రజలు

వరుస దొంగతనాల నేపథ్యంలో సిటీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చోరీలు ఎక్కువ.. రికవరీలు తక్కువగా నమోదు అవుతుండడంతో కలవరానికి గురవుతున్నారు. పెండ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం, ఇతర పనుల్లో నిమగ్నం కావడంతో.. అదే పనిగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చోరీలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.