బస్టాండ్ లో రెచ్చిపోతున్న దొంగలు .. మూడు వారాల్లో ఆరు చోరీలు

 

  •     రైతులనే టార్గెట్ గా సాగుతున్న చోరీలు
  •     పంటల విక్రయించే సమయం కావడంతోనే..
  •     సీసీ కెమెరాలు లేక వరుస ఘటనలు
  •     ఒకే రోజు రెండు.. మూడు వారాల్లో ఆరు చోరీలు

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పాత బస్టాండ్ లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. మార్కెట్​లో పంటలు అమ్ముకుని తిరిగి వెళ్తున్న రైతులనే టార్గెట్ గా చేసి జేబులు కొట్టేస్తున్నారు. మూడు వారాల్లో ఇదే తరహాలో ఆరు ఘటనలు జరిగాయి. ఈనెల11న(గురువారం) ఒక్కరోజే ఇద్దరు రైతులకు చెందిన రూ.76 వేలు నగదును కొట్టేశారు. సాయంత్రం రద్దీని చూసి బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల్లా నటిస్తున్న దొంగలు, జేబులు ఖాళీ చేసిన వెంటనే బస్సు దిగిపోతున్నారు. 

జరిగిన దారుణాన్ని అసలు బాధితుడు గుర్తించేలోగానే అక్కడి నుంచి జారుకుంటున్నారు. బస్టాండ్​లోని ఆర్టీసీ సిబ్బంది పదే పదే ‘జేబుదొంగలున్నారు జాగ్రత్త’.. అంటూ మైకులో చెబుతున్నారు తప్ప, దొంగలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కనీసం పాత బస్టాండ్ లో ఒకరిద్దరు కానిస్టేబుళ్లతో అయినా సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలేదని ఆర్టీసీ ఆఫీసర్లు చెబుతున్నారు. రోజూ వేల మంది రాకపోకలు సాగించే బస్టాండ్​లో కనీసం సీసీ కెమెరాలు లేకపోవడం ఆర్టీసీ వారి నిర్లక్ష్యమేనని పోలీసులు కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు డిపార్ట్ మెంట్ల అధికారుల నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట సొమ్ము నష్టపోయిన రైతులు బాధితులుగా మిగులుతున్నారు. 

ఖమ్మంలో దాదాపు పాతికేళ్లుగా బస్టాండ్ తన సేవలందిస్తుండగా, గతేడాది బైపాస్​రోడ్డులో కొత్త బస్టాండ్​ప్రారంభం తర్వాత పాత బస్టాండ్​ను పూర్తిగా మూసి వేశారు. దీంతో దాన్ని నమ్ముకొని బస్టాండ్ చుట్టూ వ్యాపారాలు చేసుకునే వారు తీవ్రంగా నష్టపోయారు. స్థానికుల ఆందోళనలు, ఖమ్మం ప్రజల అభిప్రాయాల మేరకు మళ్లీ మూడు నెలల క్రితం రూ.20 లక్షలతో పనులు చేయించి బస్టాండ్ ను పునరుద్ధరించారు. పల్లె వెలుగు బస్సులను పాత బస్టాండ్​నుంచి నడుపుతున్నారు. పల్లెటూళ్ల నుంచి రాకపోకలు సాగించే వేలాది మంది రోజూ ఇక్కడి నుంచే ప్రయాణిస్తున్నారు. 

అయితే బస్టాండ్​ను మళ్లీ వినియోగంలోకి తెచ్చిన తర్వాత పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయలేదు. బస్టాండ్ లో సీసీ కెమెరాలు లేక దొంగలకు వరంగా మారింది. ప్రయాణికుల్లాగానే తమ పనికానిచ్చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బంది కూడా ఇటీవల బస్టాండ్​లో వరుస చోరీలు అవుతున్నాయని, గత నెలలో చైన్​స్నాచింగ్ కూడా జరిగిందని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. పోలీసులు, ఆర్టీసీ ఆఫీసర్లు స్పందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే కనీసం ప్రయాణకులకు సేఫ్టీతో పాటు, దొంగలను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన రైతు మాలోత్ నరేశ్. ఈనెల11న మిర్చి పంటను మార్కెట్ కు తెచ్చాడు. పంటను అమ్ముకోగా రూ.2.27 లక్షలు వచ్చాయి. రూ.2లక్షలను బ్యాగ్ లో పెట్టుకున్న నరేశ్, పైన ఉన్న రూ.27 వేలను జేబులో పెట్టుకున్నాడు. ఊరు వెళ్లేందుకు ఇల్లందు బస్సు ఎక్కే సమయంలో రద్దీ ఉండగా, బస్సు సీటులో కూర్చుని చూసే సరికి ప్యాంట్ జేబులో పెట్టుకున్న డబ్బులు లేవు. దీంతో జేబు కొట్టేశారని గుర్తించి మొత్తుకునేలోగానే బస్సు ముందుకు కదిలింది. ఎవరు ఈ చోరీకి పాల్పడ్డారో గుర్తించే అవకాశం లేకుండా పోయింది. అదే రోజు కామేపల్లి మండలం అడవి మద్దులపల్లికి చెందిన రైతు రుద్రచంద్రరావు పత్తి అమ్ముకున్న డబ్బులు రూ.49,297 కూడా ఇదే తరహాలో చోరీకి గురయ్యాయి.  

అమ్మిన పైసలు మొత్తం పోయినయి..

ఏడాది పాటు కష్టపడి పండించిన పత్తి పంట పైసలు మొత్తం రూ.49 వేలు దొంగలపాలయ్యాయి. బస్సు ఎక్కుతున్న సమయంలో ఎవరు జేబు కొట్టేశారో గుర్తుపట్టలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన. బస్టాండ్​లో సీసీ కెమెరాలు లేవని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

– రుద్రచంద్రరావు, అడవిమద్దులపల్లి, కామేపల్లి మండలం