పోలీసులను డైవర్ట్ చేసేందుకు దొంగ తెలివి చూపారు!

  • ఓ ఇంట్లో వాడని సెల్ ఫోన్ తీసుకెళ్లి మరో ఇంట్లో పడేశారు 
  • నాగోల్ పీఎస్ పరిధిలోని తట్టిఅన్నారంలో ఘటన 

 ఎల్​బీనగర్,వెలుగు :  రెండిళ్లల్లో పడిన దొంగలు.. ఓ ఇంట్లో వాడని సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి.. మరో ఇంట్లో పడేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి. వివరాల్లోకి వెళితే.. నాగోలు పరిధి తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీలోని సుదర్శన్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సుదర్శన్ ఇంట్లో వాడనిసెల్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ అదే కాలనీకి చెందిన యువకుడు హర్సలాన్ దిగా గుర్తించారు.

అతనే చోరీ చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అయితే.. అతని బంధువులు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా.. కుటుంబసభ్యులు వెళ్లి కొద్దిరోజులుగా అక్కడే ఉంటుండగా ఇంట్లో ఎవరూ లేరు.  అదేవిధంగా గత శుక్రవారం హర్సలాన్ షోలాపూర్ లోని బంధువుల వద్దకు వెళ్లాడు. కాగా అతని పక్కింట్లో ఉండే బంధువులను పీఎస్ కు తీసుకెళ్లి పోలీసులు విచారించి, హర్సలాన్ వెంటనే రప్పించారు. అతని ఇంటి బయట గేటుకు తాళం వేసి ఉండి..లోపలి తలుపుల తాళాలు పగులగొట్టి ఉంది.

ఇంట్లోని పాత సెల్ ఫోన్ తో పాటు 4 తులాల బంగాలు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి హర్సలాన్ డయల్100తో పాటు పీఎస్ కు సమాచారం అందించాడు. అతని ఇంటికి వచ్చిన పోలీసులు షాక్ కు గురయ్యారు. సుదర్శన్ ఇంట్లో చోరీ చేసిన దుండగులు మొదట హర్సలాన్ ఇంట్లో పడినట్టు, వాడని సెల్ ఫోన్ తీసుకెళ్లి  పోలీసులను డైవర్ట్ చేసేందుకు సుదర్శన్ ఇంట్లో పడేసి వెళ్లినట్టు స్పష్టమైంది. హర్సలాన్ ఇంట్లోని బంగారం చోరీ అయినట్టు అనుమానించినా.. చివరకు వాళ్ల ఇంట్లోనే దొరికింది.