నిద్రిస్తున్న టైంలో  ..  రెండు ఇండ్లలో చోరీ

యాదాద్రి, వెలుగు: ఇండ్లలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న టైంలో దొంగలు ఇంట్లోకి వచ్చి చోరీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా  భువనగిరి మండలం తుక్కాపురంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన జనగాం చంద్రశేఖర్‌‌‌‌ కుటుంబ సభ్యులు గురువారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసే సరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో బీరువా కనిపించలేదు. దీంతో బయటకు వెళ్లి చూడగా ఇంటికి కొద్ది దూరంలో బీరువా పడి ఉంది. 

అక్కడికి వెళ్లి బీరువాను పరిశీలించగా అందులో ఉండాల్సిన రెండు తులాల బంగారు చైన్‌‌‌‌, తులం బంగారు కమ్మలు, 23 తులాల వెండి పట్టీలు కనిపించలేదు. అలాగే తుక్కాపురానికే చెందిన గోపగాని ప్రసన్న గురువారం రాత్రి ఇంటి ముందు తలుపులు వేసుకొని, వెనుక వైపు డోర్స్‌‌‌‌ తెరిచి పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి వెనుక నుంచి ఇంట్లోకి వచ్చి డ్రెస్సింగ్‌‌‌‌ టేబుల్‌‌‌‌లో ఉన్న ఐదు తులాల వెండి పట్టీలు, వెండి చెవి రింగులు తీసుకున్నాడు. 

అనంతరం నిద్రపోతున్న ప్రసన్న మెడలోంచి పుస్తెల తాడును తీసే ప్రయత్నం చేయగా ఆమెకు మెలకువ వచ్చి అరిచింది. దీంతో ఆ వ్యక్తి పుస్తెల తాడును గట్టిగా లాగడంతో ఓ వరుస తాడు అతడి చేతిలోకి రాగా దాన్ని తీసుకొని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.