సూర్యపేటలో రైతుపై దాడి.. రూ.4 లక్షలు చోరీ

గరిడేపల్లి, వెలుగు :  సూర్యాపేట జిల్లాలో వడ్లు అమ్ముకుని వస్తున్న రైతుపై దొంగలు దాడిచేశారు. రైతు చేతిలోని రూ.4లక్షలు గుంజుకుని పరారయ్యారు. ఎస్సై పి.వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన బెక్కం శివ పండించిన వడ్లను ఇటీవల రూ.4లక్షలకు నేరేడుచర్లలో అమ్మాడు. సోమవారం వడ్ల పైసలు తెచ్చుకునేందుకు బైక్​పై నేరేడుచర్ల వెళ్లాడు. 

డబ్బుతో తిరిగి వస్తుండగా, గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ శివారులో కారులో వచ్చిన కొందరు శివను అడ్డగించారు. శివపై దాడి చేసి, బైక్ ట్యాంక్ కవర్​లోని రూ.4 లక్షలను గుంజుని పరారయ్యారు. వెంకన్న అనే వ్యక్తి మరికొంత మందితో వచ్చి తనపై దాడి చేసి, వడ్ల పైసలు ఎత్తుకెళ్లారని బాధిడుతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అన్న బెక్కం వెంకటేశ్ తో ఫైనాన్స్ వ్యాపారంలో వివాదాలు ఉన్నాయని చెప్పాడు. అవి మనసులో పెట్టుకొని వెంకన్న ఈ పని చేశాడని  ఆరోపించాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.