వరుస చోరీలు చేస్తున్న ముఠా అరెస్ట్ 

  •     బంగారు, వెండి నగలు, నగదు,  బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం 
  •     ములుగు జిల్లా వెంకటాపురం పోలీసుల వెల్లడి

వెంకటాపురం, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు పట్టుకున్నారు. సీఐ బండారి కుమార్ తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం వెంకటాపురం శివారులో పెట్రోల్ బంకు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నూగుర్ గ్రామం వైపు నుంచి స్పెండర్ ప్లస్ (AP26N2815) బైక్ పై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా ఆపారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో  తనిఖీ చేయగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు దొరికాయి. ముగ్గురు నిందితులు జూపాక ప్రశాంత్, కల్తీ రాజు, గార ప్రవీణ్ కొద్దిరోజులుగా మండలంలోని ఎదిర, సురవీడు, ఆలుబాక వీరభద్రవరం, వెంకటాపురం గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది.

సీసీ టీవీ కెమెరాల్లోనూ రికార్డ్ అయ్యాయి. నిందితుల వద్ద బంగారపు చెవి కమ్మలు, ఉంగరాలు, రెండు జతల వెండి పట్టీలు, రూ. 5 వేల నగదు, 3 ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకొని శుక్రవారం రిమాండ్ కు తరలించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతి, సిబ్బంది ఉన్నారు.