గరిడేపల్లిలో మూడు ఇండ్లలో చోరీ

గరిడేపల్లి, వెలుగు : మండల కేంద్రమైన గరిడేపల్లిలో బుధవారం రాత్రి దొంగలు మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. గరిడేపల్లికి చెందిన రైస్ మిల్లు యజమాని రామచందర్రావు, ఖాజామొయినోద్దీన్, గట్టికొప్పుల సత్యనారాయణరెడ్డి ఇండ్లలో దొంగతనం జరిగింది. రామచందర్రావు కుటుంబం బెంగళూరులోని కూతురు ఇంటికి వెళ్లగా, ఖాజా మొయినోద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మొహరం పండుగకు కోదాడకు వెళ్లారు. గట్టికొప్పుల సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలిసింది.

వీరందరూ ఇండ్లకు తాళాలు వేసి వెళ్లగా, దొంగలు తాళాలు పగులగొట్టి రామచందర్రావు ఇంటిలో సుమారు రూ.లక్షా 50 వేల నగదు, ఖాజామొయినోద్దీన్ ఇంట్లో తులంన్నర బంగారు ఆభరణాలు, గట్టికొప్పుల సత్యనారాయణరెడ్డి ఇంట్లో రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లారు.  దొంగతనానికి పాల్పడే సమయంలో పక్కనే ఉన్న ఇంటికి కూడా బయటవైపు గడియపెట్టారు. అర్ధరాత్రి ఇద్దరు అగంతకులు సంచరిస్తుండగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయానికి పోలీసులు సైరన్ వేసుకుని రావడంతో దొంగలు పరారైనట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.