- యాదాద్రి జిల్లాలో దొంగతనాలు
- తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
- ఒక్క రాత్రే 14 ఇళ్లల్లో చోరీలు
- గత వారం చౌటుప్పల్ లోనూ ఇదే పరిస్థితి
- ఒక్కరినీ పట్టుకోలేకపోయిన పోలీసులు
రాజాపేట మండలం సింగారం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు పక్క ఊర్లో జరుగుతున్న దుర్గమ్మ పండగకు వెళ్లాయి. ఊరికి దూరంగా, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించిన దొంగలు ఆదివారం రాత్రి చోరీ చేశారు. 14 ఇళ్ల తాళాలు పగులగొట్టి, నగదు సహా నగలు దోచుకెళ్లారు. సుమారు రూ.3 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, 150 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటన స్థలాలలో వివరాలను సేకరించారు.
యాదాద్రి, రాజంపేట, వెలుగు
యాదాద్రి జిల్లాలో దోపిడి దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నా పని చేయకపోవడంతో దొంగలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రతీరోజు జిల్లాలో ఎక్కడో ఓ చోట దొంగతనం జరుగుతోంది. దొంగలు ఉదయం పూట గ్రామాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నారు. రాత్రి పూట తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్నారు.. పండగలు, పెళ్లళ్లకు వెళ్లేవారి ఇళ్లను దొంగలు ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నారు. రోడ్డుపై నడిచిపోతున్న ఒంటరి మహిళల మెడలోంచి చైన్లు లాక్కెళ్తున్నవి ఉన్నాయి. ఆరు బయట, బంగ్లాపై పడుకున్న వారి మెడలోంచి ఆభరణాలు లాక్కెళ్లిన సంఘటనలు కూడా ఇటీవల జరిగాయి. దొంగలు చివరకు ఆలయాలను కూడా వదలడం లేదు. ఇటీవల భువనగిరిలోని ఎల్లమ్మ టెంపుల్, రాయగిరిలోని మల్లన్న , ఆలేరులోని సాయిబాబా సహా పలు గుళ్లల్లో దొంగతనానికి పాల్పడి హుండీల్లో నగదు దోచుకెళ్లారు. ఇంతలా దొంగతనాలు జరుగుతున్నా పెద్ద దొంగతనాలు మాత్రమే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవుతున్నాయి.చిన్నచిన్న దొంగతనాలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, పోయిన సొమ్ము రికవరీ చేయాల్సి ఉంటుందని కేసులు నమోదు చేయడం లేదంటున్నారు. యాదగిరిగుట్ట బస్టాండ్ లో ఆదివారం ప్రయాణికురాలి మెడలో పుస్తెలతాడు కొట్టేయడానికి ఓ దొంగ ప్రయత్నించగా పట్టుకున్నారు. అయితే ఈ సంఘటనను భక్తుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా పోలీసులు చెప్పడం గమనార్హం.
గతేడాది 356 దొంగతనాలు
జిల్లాలో గతేడాది 356 దొంగతనాలు జరిగాయి. వీటిలో దారి దోపిడీకి పాల్పడ్డ సంఘటనలు 15 ఉన్నాయి. వీటిలో అనేక కేసుల్లో దొంగలు దొరకలేదు. చోరికి గురైన సొత్తు లభ్యం కాలేదు. ఈ ఏడాది దాదాపు 50కి పైగా దొంగతనాలు జరిగినట్లు తెలుస్తోంది.
ఒక్కరిని పట్టుకోలే..
చౌటుప్పల్ మున్సిపాలిటీలో గతవారం వరుసగా దొంగతనాలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ తరహా దొంగతనాలు ఈ వారంలోనే దాదాపు 10 చోట్ల జరిగాయి. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. సీసీ పుటేజీలను పరిశీలించి బిహార్ కు చెందిన దొంగలుగా అనుమానిస్తున్నారు.
యాడాది కింద దొంగతనం జరిగింది
పోయిన త్యాప ఇదే నెలలో మా ఇంట్లో దొంగలు పడి మూడున్నర లక్షల రూపాయలు ఎత్తుకపోయిర్రు. పోలీసుల్లో వచ్చి వివరాలు తీసుకపోయిర్రు. యాడాది అయినా ఇప్పటికీ దొంగలను పట్టుకోలేదు. పోలీసోళ్లు దొంగలను పట్టుకొని మా పైసలు ఇప్పియ్యాలే.
- బోనాల వెంకటేశ్, సింగారం