తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా దోచుకుంటున్నారు. పట్టపగలు ఇండ్లలో మనుషులు ఉన్నా ధైర్యంగా చోరీకి పాల్పడుతున్నారు. ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారు. లేటెస్ట్ గా ఒంగోలులో ఏపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లో చోరీకి యత్నించారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో వైరల్ అవుతోంది.
ఒంగోలులో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లోకి ఏప్రిల్ 27 అర్థరాత్రి 12 గంటల 43 నిముషాలకు ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ముఖానికి మాస్కులు ధరించి కాపలాగా ఉన్న వాచ్ మెన్ పై దాడికి యత్నించారు. కిందపడేసి కొట్టారు. వాచ్ మెన్ దొంగలను ప్రతిఘటిస్తూ కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. వెంటనే వాచ్ మెన్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎటువంటి చోరీ జరగలేదని చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.