వైఎస్ షర్మిల పాదయాత్రలో దొంగలు హల్చల్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో షర్మిల పాదయాత్రలో దొంగ.. ఓ వ్యక్తి జేబులో నుంచి 5వేలు ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించగా..ఓ ముఠాగా ఏర్పడి పాదయాత్రలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని సమాచారం.
బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ మోడల్ అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడమా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీగా మారిన టీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అధ్వాన్న పాలన సాగుతోందని షర్మిల ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిన కేసీఆర్.. దేశాన్ని ఏం ఉద్దరిస్తారని షర్మిల ప్రశ్నించారు.
తన తండ్రి దివంగత వైఎస్సార్ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇవాళ ఆయనే బతికి ఉంటే ప్రాణహిత -చేవెళ్ల ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించేవారని చెప్పారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కామారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ పేరుతో ఒక్క చుక్క నీరు రాకుండా చేశారని అన్నారు.