వికారాబాద్ జిల్లా: పరిగి మున్సిపాలిటీ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. దోమ సత్తెయ్య అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టి దొంగలు చోరీ చేశారు. బీరువా తాళం పగులగొట్టి 6 తులాల బంగారం దొంగిలించారు. 12 తులాల వెండి, 12 వేల డబ్బు బీరువాలో ఉన్నప్పటికీ దొంగలు వాటిని చోరీ చేయకపోవడం కొసమెరుపు. సత్తెయ్య, అతని భార్య బంధువుల ఇంట్లో దశదిన కర్మ కోసం వెళ్లగా దొంగలు అదను చూసి దోచుకెళ్లారు. ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంటి తాళం విరిగిపోయి కనిపించింది.. దీంతో సత్తె్య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సత్తెయ్య ఇంటికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించింది.
మహబూబాబాద్ వడ్డీ వ్యాపారి ఇంట్లో కూడా ఇటీవల భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటల్లోనే మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఈ కేసును చేధించారు. నర్సింహుల పేట మండల కేంద్రానికి చెందిన ఎరనాగి సీతారాములు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతని వద్ద ఇటీవల అదే గ్రామానికి చెందిన కోటగిరి రవి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సీతారాములు ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉందని భావించిన రవి చోరీకి ప్లాన్ చేశాడు. ఈ నెల6న మధ్యాహ్న సమయంలో సీతారాములు ఇంటి తాళం ఇనుపరాడ్‌తో తొలగించి బీరువాలోని నగలు, నగదు ఎత్తుకెళ్లాడు.
ALSO READ | Spiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..
వాటిని రవి తన వ్యవసాయ పొలం వద్ద దాచిపెట్టాడు. జనవరి 7న పోలీసుస్టేషన్లో బాధితుడు సీతారాములు ఫిర్యాదు చేశాడు. పక్కా సమాచారంతో జనవరి 8న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రవి వద్ద 28 తులాల బంగారం, 4.5 కేజీల వెండితో పాటు రూ. 8.90 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా.. మొత్తంగా చోరీకి గురైన సొత్తు విలువ రూ.26.50 లక్షలుగా పోలీసులు తెలిపారు.