ఏటీఎం ధ్వంసం చేసి.. రూ.29.70 లక్షలు చోరీ

ఏటీఎం ధ్వంసం చేసి.. రూ.29.70 లక్షలు చోరీ
  • గ్యాస్​ కట్టర్​తో మిషిన్ కత్తిరించి దొంగతనం
  • అలారాం మోగకుండా సెన్సార్​ వైర్లు కట్​ 
  • రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: హైదరాబాద్​ సిటీ శివారులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. ఎస్‌‌బీఐ ఏటీఎంను ఆరు నిమిషాల్లో ధ్వంసం చేసి రూ.29.70 లక్షలు కొల్లగొట్టింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో ఈ ఘటన జరిగింది. రావిర్యాలలోని ఎస్‌బీఐ బ్రాంచ్​ పక్కనే ఏటీఎం ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక 1.54 గంటలకు ఓ కారులో నలుగురు ముసుగు వేసుకున్న దుండగులు ఆ ఏంటీఎం సెంటర్ కు వచ్చారు.

 ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై బ్లాక్​ స్ప్రే కొట్టారు. అలారాం​ మోగకుండా సెన్సార్  వైర్లు కట్ చేశారు. గ్యాస్​ కట్టర్​తో ఏటీఎం మిషిన్  కత్తిరించి రాడ్లతో ధ్వంసం చేశారు. అనంతరం అందులోంచి రూ.29.70 లక్షలు చోరీ చేసి పారిపోయారు. అదే సమయంలో ఏటీఎంలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్​ నుంచి బ్యాంకు మేనేజర్  కొర్ర శ్రీవాణికి​ ఫోన్ రావడంతో ఆమె వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే చోరీ జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు హైవేలు, ఓఆర్ఆర్​ టోల్​  ప్లాజా నిర్వాహకులను అలర్ట్​ చేశారు. చోరీ జరిగిన ప్రదేశానికి మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు చేరుకొని పరీశీలించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, బ్యాంకు మేనేజర్  శ్రీవాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దొంగల కోసం గాలిస్తున్నారు.