- నడిగడ్డలో ఒక్క నెలలోనే 60కి పైగా దొంగతనాలు
- 30 తులాల బంగారం, రెండు కేజీల వెండితో పాటు రూ.30 లక్షలు చోరీ
గద్వాల, వెలుగు: తాళం వేసిన ఇండ్లలో చోరీలు చేస్తూ నెల రోజులుగా దొంగలు జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు గద్వాల పట్టణంలో రోజు ఏదో ఓ చోట చోరీలు జరుగుతున్నాయి. పట్టణంలో ఒక్క నెలలో 60కి పైగా చోరీలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 30 తులాల బంగారం, రెండు కేజీలకు పైగా వెండి ఆభరణాలు, లక్షల విలువ చేసే మొబైల్స్, రూ.30 లక్షల నగదు చోరీ అయ్యాయి. షాపులు, ఇండ్లు అనే తేడా లేకుండా తాళం వేసి ఉంటే చాలు దోచేస్తున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క కేసులో కూడా రికవరీ చేయకపోవడంతో పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో 40 మంది సిబ్బంది ఉండాల్సిన చోట 10 మంది మాత్రమే ఉన్నారు. గతంలో గద్వాల పట్టణాన్ని ఏడు సెక్షన్లు చేసి నైట్ బీట్ డ్యూటీలు వేసేవారు. కొంతకాలంగా నైట్ బీట్ డ్యూటీలు వేయడం లేదు. బ్లూ కోల్ట్స్ లో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే పట్టణంలో తిరుగుతుండడంతో ఈ పరిస్థితి ఉందని అంటున్నారు. గతంలో సర్కిల్ లోని కానిస్టేబుళ్లకు నైట్ డ్యూటీ వేసేవారని, ఇప్పుడు ఆ విధానం అమలు చేయడం లేదని అంటున్నారు.
దొంగతనాలు అరికట్టేందుకు రాత్రిపూట గస్తీని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నా ఒక్క కేసులో కూడా రికవరీ చేయకపోవడం గమనార్హం. దొంగతనం కేసులు ఛేదించేందుకు సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకోవాలి. దొంగతనం జరిగితే పరిశీలించి పాత రికార్డుల ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అయితే సీసీఎస్‌కు ఒక సీఐ, ఆరుగురు ఎస్ఐలు, 17 మంది సిబ్బంది ఉండాలి. సీఐ ఉండగా ఆయనకు స్పెషల్ బ్రాంచ్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఉన్న ఒక్క ఎస్ఐ రెండు రోజుల కింద వేరే పోస్టింగ్ రావడంతో వెళ్లిపోయారు ఇద్దరు బీట్ కానిస్టేబుళ్లు మాత్రమే ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నారు. ఇదిలాఉంటే చిన్నపాటి దొంగతనం కేసుల్లో కంప్లైంట్ చేసేందుకు వెళితే పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
దొంగతనాల నివారణ కోసం కాలనీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇండ్లు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఇంటికి తాళం కనిపిస్తే చాలు..
ఇటీవల శ్రీనివాస కాలనీలో రిటైర్డ్ ఎంప్లాయ్ ఇంటిలో మూడున్నర తులాల బంగారం, అర కిలో వెండి చోరీకి గురయ్యాయి. ఈ నెల 22న 5 షాపుల్లో రూ.8 లక్షల వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. 25న రెండు ఇండ్లలో చోరీలు జరిగాయి. కొన్ని రోజుల కింద ఒక వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకొని స్కూటీలో పెట్టుకోగా, అందులో నగదును మాయం చేశారు. మూడు రోజుల కింద జమ్ములమ్మ ఆలయానికి వచ్చిన భక్తురాలి మెడలో నుంచి రెండున్నర తులాల గోల్డ్ చైన్ ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఉండవల్లి మండలం, కొల్లూరు రాజా దగ్గర ఉన్న వైన్ షాపులో 50 కాటన్ల లిక్కర్ ను దొంగిలించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని లక్ష్మీ వేంకటేశ్వరకిరాణ దుకాణంలో షటర్లు ఎత్తే ప్రయత్నం చేసి మధ్యలోనే విడిచి వెళ్లినట్లు షాప్ ఓనర్ నాగిశెట్టి తెలిపారు. ఇలా ఫిబ్రవరి నెలలోనే 60 దొంగతనాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఫోకస్ పెట్టాం..
దొంగతనం కేసులను ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పకడ్బందీగా ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే కేసులను ఛేదిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.
- సత్యనారాయణ, డీఎస్పీ