- అందినకాడికి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు
- చేసిది మేమే అని చెప్పేవరకూ.. పోలీసులకు ఈ విషయం తెలియదు
- అనుమానాలకు తావిస్తోన్న వ్యాపారుల వ్యవహార శైలి
నాగర్‌కర్నూల్, వెలుగు: జిల్లాలోని మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని గోదాముల్లో దొంగలు పడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా వరి ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. దొంగతనం చేసిన వారే.. చేశామని చెప్పేవరకూ పోలీసులు, వ్యాపారులకు ఈ విషయం తెలియదు. జిల్లాలోని రెండు చోట్ల ఈ తరహా దొంగతనాలు జరగడం సంచలనంగా మారింది.
తాళాలు తీసి తాపీగా..
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో రైస్‌మిల్లర్లు వరి ధాన్యం నిల్వ చేశారు. గోదాముల్లోని ఒక్కో కంపార్ట్మెంట్లో దాదాపు 1,666 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసుకోవచ్చని అంచనా. చదరపు అడుగుకు రూ.3 రెంట్ ఫిక్స్ చేసి వ్యాపారులకు మార్కెటింగ్అధికారులు కిరాయికి అప్పగిస్తారు. అందులో ఎంత సరుకు నిల్వ చేశారు? ఎంత తరలించారనే వివరాలు రెంట్ తీసుకున్న వారికి తప్ప ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు! గోదాములను కిరాయికి తీసుకునే వ్యాపారులు నెలల తరబడి అటువైపు చూడకపోవడం, తెరవకపోవడంతో ధాన్యం దొంగలు వీటిని ఈజీగా టార్గెట్చేస్తున్నారు. 2021 నుంచి మార్కెటింగ్ గోదాములను టార్గెట్ చేస్తున్న దొంగలు.. తాళాలు తీసి బొలేరో వాహనాల్లో తాపీగా తరలిస్తున్నారు.
వనపర్తి పోలీసులు చెప్పిండ్రు
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని మార్కెటింగ్గోదాము నుంచి వరి ధాన్యం చోరీ కావడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకొని విచారించారు. 2021–--22 మధ్య కాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మార్కెటింగ్ గోదాము నుంచి కూడా ధాన్యం చోరీ చేసినట్లు చెప్పారు. దీంతో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి అలర్ట్ చేశారు.
వారు చెప్పే వరకు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం పోయిందన్న కనీస సమాచారం తెలియని వ్యాపారుల వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. కోడేరు గోదాము నుంచి 5,725 క్వింటాళ్ల ధాన్యం తరలించారంటే వ్యాపారులు ఎంత ఉదాసీనంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ కేసులో నిందితులను పోలీసులు విచారించగా.. వెల్డండ మండలం పెద్దాపూర్ గోదాము నుంచి కూడా దాదాపు 2,100 బస్తాల ధాన్యం తరలించినట్లు అంగీకరించారు. అయితే, నిందితులు అంగీకరించిన వాటితోపాటు మరో 12 వేల బస్తాల ధాన్యం మాయమైందన్న ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది.
పెద్దాపూర్ ట్విస్ట్
పెద్దాపూర్మార్కెటింగ్గోదాంలో మూడు కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో రెండు కంపార్ట్మెంట్లు వ్యాపారులు కిరాయికి తీసుకుని వరి ధాన్యం నిల్వ చేశారు. ఇందులో ఒకరు కిరాయి చెల్లించకుండా ధాన్యం తరలించడంతో కల్వకుర్తి మార్కెటింగ్అధికారులు 2022 జూలైలో ఒక కంపార్ట్మెంట్ను సీజ్ చేసి సదరు వ్యాపారికి నోటీస్ ఇచ్చారు.
సీజ్ చేసిన కంపార్ట్మెంట్ నుంచి 3 వేల బస్తాల ధాన్యం దొంగిలించామని నిందితులు స్టేట్మెంట్ ఇస్తే.. 12 వేల బస్తాల వరి ధాన్యం పోయిందని సదరు వ్యాపారి వెల్దండ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చారు. కానీ, కంపార్ట్మెంట్ను సీజ్‌చేసే సమయానికి అందులో ఎంత ధాన్యం ఉందని మార్కెటింగ్సెక్రటరీ, సూపర్వైజర్లను ఆరా తీయగా.. అంత పెద్ద మొత్తంలో అయితే లేదని చెప్పారు. ఎంత ఉందన్నది కూడా వారికి స్పష్టంగా తెలియదు. దీంతో పోలీసులు నిందితుల స్టేట్మెంట్ ప్రకారం 3 వేల బస్తాల వరకే కేసు నమోదు చేశారు.
గోదాం టూ రైస్ మిల్
మార్కెటింగ్గోదాముల నుంచి దొంగిలించిన వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1000 చొప్పున అగ్వకు అమ్ముకున్న నిందితులు వచ్చిన డబ్బును జల్సాలకు వాడుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలోని సాతాపూర్ రైస్మిల్యజమాని ఈ ధాన్యాన్ని కొనుగోలు చేశానని అంగీకరించడంతో అతడి నుంచి రూ.1.16 లక్షల నగదు,2.75 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు అశోక్ లేలాండ్ వెహికిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రైస్ మిల్ యజమానితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. గోదాముల్లో నిల్వ ఉంచినవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యమా? లేక వ్యాపారులు ఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి నిల్వ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. నిల్వ చేసింది సర్కార్ ధాన్యమే అయితే జిల్లాలో ఇంకా 46 వేల సీఎంఆర్ టార్గెట్ ఎందుకు పూర్తి కావడం లేదన్నది ప్రశ్నగా మిగులుతోంది.