దోమలగూడ, నార్సింగిలో కిలోల కొద్ది బంగారం, వెండి చోరీ..

దోమలగూడ,  నార్సింగిలో కిలోల కొద్ది బంగారం, వెండి చోరీ..
  • దోమలగూడలో రెచ్చిపోయిన దొంగలు
  • 2 కిలోల బంగారంతో పరార్​
  •  నార్సింగి ఏరియాలో ఒకే రోజు 4 ఇండ్లల్లో చోరీలు 
  • 8 తులాల గోల్డ్,12 తులాల వెండి, 5లక్షలు మాయం

ముషీరాబాద్/గండిపేట, వెలుగు: దోమలగూడలో భారీ దొంగతనం జరిగింది. ఆభరణాలు తయారు చేసే వ్యక్తి ఇంట్లోకి మారణాయుధాలతో చొరబడిన ఎనిమిది మంది దొంగలు.. 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. 

కోల్​కతాకు చెందిన రంజిత్ గౌరయ్ (55) కొన్నేండ్లుగా దోమలగూడలోని అరవింద్ నగర్​లో నివాసం ఉంటున్నాడు. గోల్డ్​షాపుల నుంచి ఆభరణాల ఆర్డర్ తీసుకుని రెడీ చేసి ఇస్తుంటాడు.  రంజిత్ వద్ద 30 నుంచి- 40 మంది కార్మికులు పని చేస్తున్నారు.

 గురువారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో 8 మంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో  రంజిత్ ఇంటికి వచ్చి బెల్ కొట్టారు. తలుపులు తెరిచిన రంజిత్​ను కత్తులతో బెదిరించి, ఇంట్లో ఉన్న రెండు కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. 

వెంటనే బాధితుడు సమాచారం ఇవ్వడంతో దోమలగూడ పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో​తనిఖీలు చేపట్టి, నిందితుల కోసం గాలిస్తున్నారు. రంజిత్ వద్ద పని చేస్తున్న కార్మికుల్లో ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డారా? లేక ఇది తెలిసిన వారి పనినేనా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలనూ పరిశీలిస్తున్నారు. 

 

  • నార్సింగి ఏరియాలో నాలుగు చోరీలు 

నార్సింగి పీఎస్ పరిధిలో దొంగల ముఠా రెచ్చిపోయింది. తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి మొత్తం నాలుగు చోట్ల దొంగతనం చేశారు. బండ్లగూడ జాగీర్, కార్పొరేషన్ హైదర్షాకోట్‌‌‌‌ శాంతినగర్‌‌‌‌ కాలనీలో తాళాలు వేసిన నాలుగు ఇండ్లలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 

ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. నాలుగు ఇండ్లలో మొత్తం 8 తులాల బంగారం, 12 తులాల వెండితో పాటు రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌‌‌‌ టీమ్‌‌‌‌ సాయంతో ఆధారాలను సేకరించారు. నిందితుల కోసం స్థానికంగా ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.