పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడి రెండు హూండీలను ఎత్తుకెళ్లారు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం... శనివారం ఉదయం ఆలయ అర్చకుడు పార్ధీవశర్మ ఆలయానికి వచ్చి మండపం మొయిన్ డోర్ తాళాలు తీసి గర్భగుడిలోకి వెళ్లారు. గర్భగుడికి కుడివైపు ఉన్న గ్రిల్స్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు వచ్చి ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న హుండీలను గుర్తించారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి వచ్చి హుండీలను పగులగొట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. వీలుకాకపోవడంతో హుండీలను బయటకు తీసుకెళ్లి తాళాలు పగులగొట్టి అందులోని డబ్బులు, కానుకలు తీసుకెళ్లారు. జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.