సెంట్రల్ నిధులు..  స్టేట్ పనులు 

  •     శాంక్షన్ క్రెడిట్ తమదంటే తమదంటున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు
  •      టూర్ లో ఉండగా భూమిపూజ నిర్వహించడంపై ఎంపీ సంజయ్ ఆగ్రహం 
  •     చర్చనీయాంశంగా మారిన ఆర్వోబీ రగడ

కరీంనగర్, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరేళ్లుగా నలుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)  శంకుస్థాపనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సేతుబంధన్ ప్రాజెక్టులో భాగంగా..  100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధుల(రూ.126.74 కోట్ల)తో చేపట్టిన ఈ బ్రిడ్జి పనులు.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సాగనున్నాయి. ఇటీవలే టెండర్లు ఖరారు కాగా గురువారం పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు.

ఇన్నాళ్లు టెండర్ల ఖరారు, భూసేకరణలో తీవ్ర జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాను   టూర్ లో ఉన్న సమయంలో శంకుస్థాపనకు పూనుకోవడంపై  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఒక రోజు ముందే  ఇన్విటేషన్ పంపడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 

క్రెడిట్ గోస్ టూ!

తీగలగుట్టపల్లిని కరీంనగర్ సిటీలో విలీనం చేయడంతో ఆర్వోబీకి పర్మిషన్లు రావడం ఈజీ అయింది. అయితే నిధుల విషయంలో పేచీ వచ్చి పడింది. తొలుత ఆర్వోబీ నిర్మాణ వ్యయంలో 80 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించిందని, ఆ తర్వాత మాట తప్పడం వల్లే మంజూరులో ఆలస్యం జరిగిందనేది బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.  అంతేగాక తాను ఎంపీ అయ్యాక పలుమార్లు కేంద్ర రైల్వే, రహదారుల శాఖ  మంత్రులను పలుమార్లు కలవడంతో ఆర్వోబీకి 8 నెలల క్రితమే కేంద్రం ఆమోదం తెలిపిందని, టెండర్లు పిలవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు ఆలస్యం చేసిందన్నారు.

అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి విధిగా రావాల్సిన సెంట్రల్ రోడ్డు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(సీఆర్ఐఎఫ్​) నుంచి మాత్రమే ఆర్వోబీకి రూ. 126 కోట్లు కేటాయించారని, ఇందులో కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిందేమి లేదని, ఇదంతా మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితోనే జరిగిందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అంటున్నారు.

 నిర్మాణం సాగేదిలా.. 

కరీంనగర్ - మంచిర్యాల రూట్ లో నిజామాబాద్, కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ కు ఇరువైపులా ఆర్వోబీని నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జిపై సుమారు 80 ఫీట్ల వెడల్పుతో ఉండే రోడ్డు, ఇరువైపులా నడిచేందుకు ఫుట్ పాత్ లు నిర్మించనున్నారు. ఇరు వైపులా రెండు భారీ పిల్లర్లు నిర్మించి దానిపై స్టీల్ బేరింగ్ లు, బ్రిడ్జి డెక్ లు ఫిక్స్ చేస్తారు. ఇటు కరీంనగర్ వైపు, అటు చొప్పదండి వెళ్లే వైపు అప్రోచ్ రోడ్లను నిర్మిస్తారు. ఆర్వోబీ సాధనలో ఎవరి కృషి ఎలా ఉన్నా పనులు త్వరగా పూర్తయితే ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే వారికి  మరో ఏడాది, రెండేళ్లలో కష్టాలు తీరనున్నాయి.

సొమ్ము కేంద్రానిదైతే... సోకు మీరు చేసుకుంటారా ? 

తీగలగుట్టపల్లి ఆర్వోబీ మంజూరు మా ఘనతేనంటూ నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు 8 ఏళ్లుగా పనులెందుకు చేపట్టలేదో, ఆర్వోబీ నిర్మాణ వ్యయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలి. నయాపైసా కూడా కేటాయించకుండా ఇచ్చిన మాట తప్పిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఇదంతా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆర్వోబీ నిర్మాణ ఖర్చంతా కేంద్రమే భరించేలా ఒప్పించింది నేనే. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఒక నిండు ప్రాణం బలైంది. శంకుస్థాపనకు ఆహ్వానించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. 

- బండి సంజయ్, ఎంపీ, కరీంనగర్ 

తొమ్మిదేళ్ల పోరాట ఫలితమిది

2014లో బి.వినోద్ కుమార్ ఎంపీగా గెలిచాక తీగలగుట్టపల్లిలో ఆర్వోబీని నిర్మించాలని అనేకసార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిశారు. తీగలగుట్టపల్లి గ్రామం కావడంతో రైల్వే శాఖ అప్పట్లో ఆర్వోబీ మంజూరులో జాప్యం చేసింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితో కరీంనగర్ కార్పొరేషన్ లో తీగలగుట్టపల్లి విలీనమైంది. దీంతో అనుమతులు ఈజీ అయ్యాయి. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పోరాట ఫలితంగా ఆర్వోబీ మంజూరైంది. 

- వై. సునీల్ రావు, మేయర్, కరీంనగర్