నవాబుపేట, వెలుగు: ఓ ప్రైవేట్ వ్యక్తి తన వెంచర్ కాంపౌండ్ వాల్ కోసం నక్షా రోడ్‌ను కబ్జా చేస్తున్నారని మండలంలోని సిద్దోటం, తీగలపల్లి గ్రామస్తులు బుధవారం ఆందోళనకు దిగారు. తీగలపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 172లో జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కూతురు పేరిట ఉన్న భూమిలో ఫాంహౌస్ పనులు నడుస్తున్నాయి. కాగా, తీగలపల్లి నుంచి సిద్దోటం గ్రామాలను కలిపే 33 ఫీట్ల నక్షా రోడ్డును కబ్జా చేసి ప్రహారీ గోడను నిర్మించారు. గత నెలలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా, సర్వే చేయించి గోడను తొలగిస్తామని పనులను నిలిపేశారు.
ఆ తరువాత పనులు చేస్తుండడంతో గ్రామస్తులు, రైతులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్నఆర్ఐ కిరణ్‌కుమార్, సర్వేయర్ బంగారప్ప అక్కడికి చేరుకుని సర్వే చేసి కబ్జా చేసిన స్థలం రోడ్డుదేనని తేల్చారు. ఇదిలాఉంటే స్థలాన్ని వదిలేది లేదని ఏం చేస్కుంటారో చేసుకోండని కబ్జాదారుడు అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. రోడ్డును కబ్జా చేస్తున్న వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కంచెను తొలగించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.