అయిజ, వెలుగు: అయిజ పట్టణంలో వెలసిన తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ వంశపారంపర్య అర్చకుడు పాగుంట లక్ష్మిరెడ్డి ఇంటి నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ వీధుల గుండా ఊరేగిస్తూ ఆలయానికి చేర్చారు. ఊరేగింపులో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళ్యాణదుర్గం కళాకారుల బొమ్మల నృత్య ప్రదర్శన, ఆదివాసీ గుస్సాడీ నృత్యం,నంది కోలు సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామిఊరేగింపుకు మహిళలు నిండు బిందెలతో నీళ్లు పోసి కొబ్బరి కాయలు కొట్టి స్వాగతం పలికారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 28న ప్రభోత్సవం,29న ఉదయం నిత్య పూజలు, రాత్రికి రథోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 1న సంధ్యరాళ్లు ఎత్తే పోటీలు, 2న ఓపెన్ కబడ్డీ టోర్నీ, రాత్రికి అంతరాష్ట్ర భజన పోటీలు, 4న జాతీయ స్థాయి కుస్తీ పోటీలు, 5న ఒంటెద్దు బండ్ల గిరక పోటీలు,6న అంతర్రాష్ట్ర పోటీల బల ప్రదర్శన పోటీలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 11న తిక్క వీరేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాం అర్చకుడి స్వగృహానికి చేరుకతో ఉత్సవాలు ముగియనున్నాయి.