ప్రైవసీకి తూట్లు : ప్రతి మాటా.. చాటుగా రికార్డింగ్​

ప్రైవసీకి తూట్లు : ప్రతి మాటా.. చాటుగా రికార్డింగ్​

మన ప్రతి అడుగు, ప్రతి మాట.. ఎక్కడో ఒక చోట రికార్డవుతూనే ఉంది. మనం వాడే స్మార్ట్​ ఫోన్లు, వాటిలో ఇన్​స్టాల్ చేసే యాప్స్, స్మార్ట్​ స్పీకర్ల ద్వారా.. మనకు తెలియకుండానే మన డాటాను దోచేస్తున్నాయి. కొన్ని సమయాల్లో ఫోన్ ఆఫ్ లో ఉన్నా కెమెరా ఆన్​లోనే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతిమాటను స్పీకర్ రికార్డు చేస్తుంటుంది. భార్యభర్తల బెడ్రూం వీడియోలు నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుత పరిస్థితికి ఇవి చిన్న ఉదాహరణలే. ఇంప్రూవ్ మెంట్ కోసం 0.2 శాతం ఆడియో క్లిప్పులే వాడుతున్నామన్న గూగుల్ చెబుతోంటే.. రికార్డింగ్స్ మేం డెలిట్ చేయలేం.. మీరే చేసుకోండని అమెజాన్ సూచిస్తోంది.

స్మార్ట్ ప్రపంచం.. ఇక్కడ ప్రైవసీ అనేది ఓ ఎండమావి. ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఉండదు. ప్రతి అడుగు, ప్రతి మాట.. ఎక్కడో ఒక చోట రికార్డవుతూనే ఉంటుంది. మనం వాడే ఫోన్లు, వాటిలో ఇన్​స్టాల్ చేసే యాప్స్.. మనకు తెలియకుండానే మన సమాచారాన్ని దోచేస్తున్నాయి. కొన్ని సమయాల్లో ఫోన్ ఆఫ్ లో ఉన్నా కెమెరా ఆన్​లోనే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతిమాటను స్పీకర్ రికార్డు చేస్తుంటుంది. భార్యభర్తల బెడ్రూం వీడియోలు కూడా ఇంటర్​నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయన్న వార్తలు అప్పుడప్పుడు వింటూనే విన్నాం. ప్రస్తుత పరిస్థితికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. ఏడాది కిందట వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా సైబర్ నేరాలు, ప్రైవసీ ప్రమాదం గురించి చెప్పకనే చెప్పింది.

ఎక్కడున్నా సాయం చేసేందుకు రెడీ అంటూ గూగుల్  ప్రవేశపెట్టిన ‘గూగుల్ అసిస్టెన్స్‌’ పై ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఓకే గూగుల్’ అని వాయిస్ ద్వారా ఆర్డరిస్తే చాలు మెసేజ్ లు పంపడం, ఫోన్ కాల్ చేయడం, గూగుల్ మ్యాప్ లో దారి చూపడం, మనకిష్టమైనవి ప్లే చేస్తున్న గూగుల్ అసిస్టెన్స్‌.. గుట్టుచప్పుడు కాకుండా మన మాటలనూ రికార్డు చేస్తోంది. ఈ విషయాన్ని బెల్జియం దేశానికి చెందిన ‘వీఆర్టీఎన్ డబ్ల్యూఎస్’ సంస్థ చెప్పింది. గూగుల్ తరఫున పని చేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లు మన మాటలను స్మార్ట్ ఫోన్లు, హోమ్ స్పీకర్స్, సెక్యూరిటీ కెమెరాల్లో వాడే గూగుల్ అసిస్టెంట్ ద్వారా వింటున్నట్లు బయటపెట్టింది. ఆ ఆడియో రికార్డులను సబ్ కాంట్రాక్టర్లకు పంపుతున్నారని, గూగుల్ స్పీచ్ రికగ్నిషన్ ను మరింత మెరుగుపరచడానికంటూ వాటిని వాడుతున్నట్లు  వెల్లడించింది.

ఓకే గూగుల్ అనకున్నా…

‘‘సబ్ కాంట్రాక్టర్లకు పంపిన రికార్డింగ్స్​లో.. అడ్రస్​లు, ఇతర సెన్సిటివ్ సమాచారం కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. వీటితో సదరు వ్యక్తులను ఈజీగా గుర్తించవచ్చు. ఏదైనా సమాచారంతో బెదిరించొచ్చు కూడా” అని వీఆర్టీఎన్ డబ్ల్యూఎస్ వెల్లడించింది. బెల్జియం, నెదర్లాండ్ యూజర్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారం, బెడ్రూమ్ సంభాషణలు, గృహహింస.. ఇది లేదు అనకుండా ప్రతి సమాచారం ఆ రికార్డింగ్స్​లో ఉన్నట్లు చెప్పింది. మగవాళ్లు పోర్న్ కోసం సెర్చ్ చేయడం, దంపతుల మధ్య వాగ్వాదాలు కూడా రికార్డైనట్లు వెల్లడించింది. బెల్జియం, నెదర్లాండ్‌తోనే ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా యూజర్ల రికార్డింగులూ సేకరిస్తున్నట్లు చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యూజర్లు ఓకే గూగుల్ అని చెప్పకున్నా.. రికార్డింగ్స్ జరుగుతున్నాయని తెలిపింది.

రికార్డు చేస్తున్నాం.. కానీ..

గూగుల్ అసిస్టెంట్ వాయిస్ రికార్డింగులపై గూగుల్ వివరణ ఇచ్చింది. వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసేందుకు కేవలం 0.2 శాతం ఆడియో క్లిప్పులను మాత్రమే తాము వాడుకుంటున్నట్లు చెప్పింది. మరోవైపు ఇలా అక్రమంగా రికార్డు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపింది. ‘‘సెక్యూరిటీ పాలసీలను కాంట్రాక్టర్ ఉల్లంఘించారు. అందుకే కాంట్రాక్టర్​పై విచారణకు ఆదేశించాం” అని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ప్రతిసారి డిలీట్ చేయలేం: అమెజాన్

ఇళ్లల్లో సంభాషణలను రికార్డు చేస్తోందంటూ ‘అమెజాన్ అలెక్సా’పైనా ఆరోపణలు వచ్చాయి. వస్తున్నాయి. కొందరు కోర్టులకెక్కారు. లక్షల మంది పిల్లల వాయిస్ రికార్డింగ్ లను అమెజాన్ సేవ్ చేసుకుంటోందని మసాచుసెట్స్ కు చెందిన మహిళ.. ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. అంతకుముందు మే నెలలో.. స్మార్ట్ స్పీకర్ల ద్వారా సంభాషణలను రికార్డు చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని యూఎస్ సెనేటర్లు, 19 మంది లాయర్లు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ను డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ అమెజాన్ తిరస్కరించింది. తర్వాత మాత్రం వాయిస్​లు రికార్డు అవుతాయని, అలెక్సా, ఎకో లైన్–అప్ స్పీకర్లలో స్టోర్ అయిన డేటాను ఎల్లప్పుడూ డిలీట్ చేయలేమని, యూజర్లు మాన్యువల్ గా డిలీట్ చేసేవరకు అలాగే ఉంటుందని వివరణ ఇచ్చింది.