భారత జట్టును అవమానించిన పాక్ అభిమాని.. బుద్ధి చెప్పిన హర్ష భోగ్లే

భారత జట్టును అవమానించిన పాక్ అభిమాని.. బుద్ధి చెప్పిన హర్ష భోగ్లే

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి కథలు కథలుగా వింటుంటాం. భారత టెస్ట్ జట్టుకు ప్రాణం పోసిందే అతడిని, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి(నెంబర్.1) చేర్చడం అతనికే సాధ్యమైందని గొప్పగా చెప్పుకుంటాం. అయితే, అతని సారథ్యంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. అదే 36 పరుగులకు ఆలౌట్. 2020-21 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కాగా, ఏ ఒక్కరూ రెండెంకెల స్కోర్ చేయలేకపోయారు. దీంతో టీమిండియా పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. 

నిజానికి తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు అంత దారుణమైన ప్రదర్శన చేసినా.. ఆ తర్వాత పుంజుకొని సిరీస్ ను 2-1తేడాతో  సొంతం చేసుకుంది. కానీ పాకిస్తాన్ అభిమానులు మాత్రం 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ టీమిండియాను హేళన చేస్తుంటారు. ఇప్పుడు ఓ పాక్ అభిమాని మరోసారి అలాంటి అత్యుత్సాహం చూపగా.. భారత క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే అతనికి తగిన బుద్ధి చెప్పారు. 

"ఒకవేళ మీ మూడ్ బాగోలేకపోతే.. ఆస్ట్రేలియా ఆటగాళ్ల చేతిలో బాధింపబడిన భారత క్రికెటర్ల ఆటను ఆస్వాదించండి.." అంటూ ఫరూక్‌ అనే ఓ పాక్ అభిమాని 36 పరుగులకు ఆలౌట్ అయిన వీడియోను ట్వీట్ చేశాడు. అందుకు హర్ష భోగ్లే బదులిస్తూ పాక్ పౌరులు ఆలోచనలు ఇకనైనా మారాలని అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చారు.

"ఫరూక్‌ మీరు ఈ విషయాన్ని ప్రస్తవించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా.. ఎందుకంటే ఇది టెస్ట్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనకు దారితీసింది. పేలవ ప్రదర్శనలు.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలుగా ఎలా మారుతాయనే దానికి ఇదొక  కేస్ స్టడీ. ఇకనైనా మీరు వేరొకరి కష్టాలను చూసి నవ్వుతూ బ్రతుకే రోజులకు ముగింపు పలకండి.. ఇలానే చేస్తూ పోతే గొప్ప లక్ష్యాలను చేరుకోలేరు.. కాబట్టి పెద్దగా ఆలోచించండి.. ఉన్నత లక్ష్యాలను చేరుకోండి.. అలా చేస్తే అద్భుతమైన ప్రపంచాన్ని కనుగొనవచ్చు.." అని భోగ్లే ట్వీట్ చేశారు.

సొంత అభిమానుల చేత చీవాట్లు

హర్ష భోగ్లే ట్వీట్ తో సొంత దేశ అభిమానులు కూడా ఫరూక్‌ అనే పాక్ అభిమానికి చీవాట్లు పెడుతున్నారు. అతని వంటి వారి వల్ల పాక్ పరువు పోతోందని వారిలో వారు తన్నుకుంటున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్ల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.