తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్స్‌ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ (ఎన్ఐ ఎన్) సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్స్ లో కోళ్లకు అవసరమున్నా, లేకపోయినా యాంటీ బయాటిక్స్ విచక్షణరహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్‌ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదముందని హెచ్చరించారు.
సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం..
కేరళను సౌత్ జోన్ గా, తెలంగాణను సెంట్రల్ జోన్ గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీఫామ్స్ లోని 131 శాంపిళ్ల(కోడి రెట్టల)ను సేకరించి, వాటి నుంచి డీఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఈ కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆరియస్తో పాటు క్లాస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్, క్లేబ్సియెల్లా ఎంటరోకోకస్ ఫెకాలిస్, సూడోమోనాస్ ఎరుగినోసా, బాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాళ్లను సైంటిస్టులు కనుగొన్నారు.
ఇవన్నీ మన దేశంలో యాంటీ బయాటిక్ ట్రీట్ మెంట్‌కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ షోబీ వేలేరి, సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చికెన్‌ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95 శాతం బ్యాక్టీరియా నాశనమవుతుందని తెలిపారు. తెలంగాణతో పోలిస్తే కేరళలోనే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.