- ఆయన ర్యాలీకి దగ్గరలో గన్స్ తో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్
లాస్ఏంజెల్స్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు మరొకరు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ టీమ్ నిందితుడిని ముందుగానే గుర్తించి అరెస్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ట్రంప్ శనివారం నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీ దగ్గర గన్స్‌తో తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. అతడిని లాస్ వెగాస్‌కు చెందిన వెమ్ మిల్లర్(49)గా గుర్తించామని, బెయిల్‌పై విడుదల చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. నిందితుడు ఫేక్ ఎంట్రీ పాస్‌తో ట్రంప్ ప్రచార వేదికకు దగ్గరకు వచ్చాడని, లోడ్ చేసిన షార్ట్ గన్, మరో హ్యాండ్ గన్, హై కెపాసిటీ ఉన్న మ్యాగజైన్‌తో తిరుగుతుండగా అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. నిందితుడి కారులోంచి వివిధ పేర్లతో నకిలీ పాస్‌పోర్టులు, రిజిస్టర్ కాని కారు లైసెన్స్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫేక్ ఐడీలన్నీ ట్రంప్ హత్య అనంతరం విదేశాలకు పారిపోయేందుక నిందితుడు చేసుకున్న ఏర్పాట్లు అయ్యుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, విచారణలో భాగంగా నిందితుడు వెమ్ మిల్లర్.. తాను ట్రంప్ మద్దతుదారుడినని పేర్కొన్నాడు. తన దగ్గరున్న వెపన్స్ తన సేఫ్టీ కోసం కొనుగోలు చేసినవేనని వెల్లడించాడు.
రెండుసార్లు తప్పించుకున్నడు..
ట్రంప్‌పై ఇదివరకే రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ప్రచార సభ నిర్వహించినప్పుడు దుండగుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ట్రంప్ కుడి చెవిని తాకుతూ బులెట్ దూసుకెళ్లింది. ఇంకోసారి ఫ్లోరిడాలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఫెన్సింగ్ నుంచి కాల్పులు జరిపినప్పటికీ బులెట్లు ట్రంప్ దాకా చేరలేదు. రెండు ఘటనల్లోనూ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.