IND vs ENG 5th Test: సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యంలో భారత్

IND vs ENG 5th Test: సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యంలో భారత్

ధర్మశాల టెస్టులో భారత ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. వచ్చిన వారు వచ్చినట్టు పరుగుల వరద పారిస్తున్నారు. ఓపెనర్ జైస్వాల్ మొదలుకొని సర్ఫరాజ్ వరకు అందరు తమ బాధ్యతలను సమర్ధవంతంగా పోషించారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. టీ విరామానికి 3 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. క్రీజ్ లో సర్ఫరాజ్ ఖాన్ (56), దేవ్ దత్ పడికల్(44) ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 158 పరుగులకు చేరుకుంది.

వికెట్ నష్టానికి 264 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ (103)ను బెన్ స్టోక్స్ తన తొలి బంతికే బౌల్డ్ చేశాడు. ఈ సిరీస్ లో స్టోక్స్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. సెంచరీ తర్వాత  అండర్సన్ బౌలింగ్ లో రెండు బౌండరీలు బాది ఊపు మీదున్న గిల్ (110).. ఆ తర్వాత ఓవర్లో అతని బౌలింగ్ లోనే బౌల్డయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ దశలో టీమిండియాను ఆదుకునే బాధ్యతను కొత్త కుర్రాళ్ళు సర్ఫరాజ్ ఖాన్, పడికల్ తీసుకున్నారు.

ALSO READ :- PSL 9: పాక్ సూపర్ లీగ్‌లో అంతే: గ్రౌండ్‌లోనే గొడవపడిన ఆటగాళ్లు

 
తొలి టెస్ట్ ఆడుతున్న పడికల్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అండర్సన్ వేసిన ఒక ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్ లోకి వచ్చాడు. మరో ఎండ్ లో సర్ఫరాజ్ పరుగులు చేయడానికి మొదట సమయం ఎక్కువగా తీసుకున్నా.. ఆ తర్వాత పవర్ హిట్టింగ్ తో ఇంగ్లాండ్ కు దడ పుట్టించాడు. ముఖ్యంగా స్వీప్ షాట్స్ తో బౌండరీల వర్షం కురిపించాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్ లో మూడో టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్ కు ఇది మూడు హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, అండర్సన్ , బషీర్ లు తలో వికెట్ తీసుకున్నారు.