- గోవా, ఊటీ, అండమాన్ దీవులకు తలపించేలా ఏర్పాటు
- ఆహ్లాదాన్ని పంచేలా సౌలత్లు
- 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
- ప్రకృతి అందాలతో చూపరులను కట్టిపడేస్తున్న కొత్త ఐలాండ్
- ప్రారంభించిన మంత్రులు జూపల్లి, సీతక్క
ములుగు, వెలుగు : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్సమీపంలోని లక్నవరం సరస్సులో మూడో ఐలాండ్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. రూ.7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. గోవా, ఊటీ, అండమాన్, మాల్దీవుల్లోని ఐలాండ్లకు దీటుగా దీనిని ఏర్పాటు చేశారు. అలాగే, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా, మున్నార్ వంటి ప్రాంతాలను తలపించేలా ఈ ద్వీపాన్ని సుందరీకరించారు. ఈ ఐలాండ్‌ను బుధవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. లక్నవరం సరస్సు టూరిస్టుల స్వర్గధామమని పేర్కొన్నారు.
ప్రజలు నిత్యం బిజీ షెడ్యూల్ లో గడపడమే కాకుండా పర్యాటక ప్రాంతాలలో పర్యటించి మానసిక ఉల్లాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచలనలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉండడంతో పాటు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతర మంచి గుర్తింపు తెచ్చి పెడుతున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులకు పెద్దపేట వేస్తున్నామని పేర్కొన్నారు. లక్నవరంలో ఐదేండ్లపాటు ఫ్రీ కోట్స్ సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు వసతులు కల్పిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులను వృథా చేసుకోకుండా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉల్లాసాన్ని పొందాలని మంత్రి కోరారు.
100 కోట్ల నిధులు కోరినం : మంత్రి సీతక్క
పర్యాటక రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని.. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆ నిధులు వచ్చేలా కృషి చేయాలన్నారు. లక్నవరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. టూరిజం స్పాట్లలో పర్యటించే ప్రతీ ఒక్కరికీ 30శాతం ఆయుష్షు పెరుగుతుందని మంత్రిపేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పర్యాటక ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, పీపీపీ మాడల్ తరహాలో పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ..ఈ నెల 26నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతానన్నారు.