720కి 715 స్కోర్ చేసిన తుమ్మల స్నికిత
స్టేట్ నుంచి 24,768 మందికి ర్యాంకులు
49.15% మంది మాత్రమే పాస్
జాతీయ స్థాయిలో 56.44% మంది క్వాలిఫై
ఒడిశా స్టూడెంట్ ఫస్ట్.. ఢిల్లీ అమ్మాయి సెకండ్
ఏపీ అమ్మాయికి ఆరో ర్యాంక్
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) రిజల్ట్స్ లో ఈసారి తెలంగాణ స్టూడెంట్లు వెనకబడ్డారు. రాష్ర్టం నుంచి 50,392 మంది పరీక్ష రాస్తే, 24,768 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. గతేడాది 67.44 శాతం మంది పాస్ అయితే, ఈసారి 49.15 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈసారి జాతీయ స్థాయిలో టాప్ టెన్ ర్యాంకర్లలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఇందులో రాష్ట్రం నుంచి తుమ్మల స్నికిత 715 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సొంతం చేసుకుంది. ఏపీకి చెందిన గుత్తి చైతన్య సింధు ఆరో ర్యాంకును దక్కించుకుంది. ఏపీ నుంచి 57,721 మంది పరీక్ష రాయగా, 33,841(58.63%) మంది క్వాలిఫై అయ్యారు. జాతీయ స్థాయిలో టాప్ 50 ర్యాంకర్లలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు ఉండగా, ఏపీ స్టూడెంట్లు 8 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం15,97,435 మంది నీట్ కు అప్లై చేసుకున్నారు. ఇందులో13,66,945(85.57 శాతం) మంది పరీక్ష రాశారు. వీరిలో 7,71,500 (56.44 శాతం) మంది క్వాలిఫై మార్కులు సాధించారు. ఒడిశాకు చెందిన షోయబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్ 720కి 720 మార్కులు సాధించారు.
కాంపిటీషన్ తగ్గినట్టే..
రాష్ర్టంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,715 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3,200 సీట్లు ఉన్నయి. గవర్నమెంట్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను స్టేట్ లెవల్ ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం నేషనల్ ర్యాంకులే విడుదల చేశారు. పది రోజుల్లో స్టేట్ లెవల్ ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉందని కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్వాలిఫై అయిన వాళ్ల సంఖ్య తగ్గడంతో సీట్లకు కొంత కాంపిటీషన్ తగ్గినట్టేనని నిపుణులు చెబుతున్నారు.