BBL: థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం.. బిగ్ బాష్ లీగ్‌లో ఏం జరుగుతుంది..?

క్రికెట్ లో అంపైర్ తప్పులు చేయడం సహజంగా జరుగుతుంటుంది. ఎల్బీడబ్ల్యూ విషయంలో తప్పుగా అంచనా వేయడం.. క్యాచ్ ల విషయంలో అయోమయం..రనౌట్ విషయంలో స్పష్టత లేకపోవడం కారణంగా థర్డ్ అంపైర్ కు ఈ నిర్ణయాన్ని వదిలేస్తాడు. సిస్టంలో చెక్ చేసి థర్డ్ అంపైర్ సరైన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ కు తెలియజేస్తారు. అయితే కుర్చీలో కూర్చొని చూసే థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాన్ని ఇచ్చాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
  
బిగ్ బాష్ లీగ్  2023-2024 లో భాగంగా జనవరి 6 న మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్‌ల మధ్య జరిగింది. ఇమాద్  వేసిన ఈ ఓవర్లో జేమ్స్ విన్స్ నేరుగా షాట్ ఆడాడు. బంతి బౌలర్ చేతిని తాకుతూ స్టంప్స్‌కు తగిలింది. దీంతో ఇమాద్ రనౌట్ కు అప్పీల్ చేశాడు. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న జోష్ ఫిలిప్ బంతి వికెట్లకు తగలకముందే క్రీజులోకి వచ్చినట్టు రీప్లేలు చూపించాయి. అయితే ఇక్కడే థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ చేసిన ఒక పొరపాటుకు అందరూ షాకయ్యారు. పొరపాటు బటన్ తప్పుగా నొక్కి నాటౌట్ ను 'ఔట్' గా ప్రకటించాడు. 

ఔట్ అని ప్రకటించగానే గ్రౌండ్ లోని ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. అంపైర్ మరోసారి థర్డ్ అంపైర్ ను పరిశీలించమని కోరగా.. థర్డ్ అంపైర్ తన తప్పు తెలుసుకుని 'నాటౌట్'గా ప్రకటించాడు. అంపైర్ తప్పిదం నుండి బయట పడిన జోష్ ఫిలిప్..ఎనిమిది బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి స్కాట్ బోలాండ్‌ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 156 చేసింది. లక్ష్య ఛేదనలో సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లో అలవోకగా ఛేజ్ చేసింది. జేమ్స్ విన్స్ (57 బంతుల్లో 79), డేనియల్ హ్యూస్ (32 నుండి 41) భాగస్వామ్యంతో 11 బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.