- ఇతర జాబ్‌లు వెతుక్కుంటున్న ఎంప్లాయీస్
- సెల్ఫ్ బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్న మరికొందరు
- రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హోటల్ ఇండస్ట్రీలపైనే ఎక్కువ ప్రభావం
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్లపైనా పడింది. ఫస్ట్, సెకండ్ వేవ్ ల్లోనే చాలా కంపెనీలు ఉద్యోగులను జాబ్‌ల నుంచి తీసేశాయి. ప్రస్తుతం కొద్దిమందితోనే నడిపిస్తుండగా వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. మాములుగా అయితే మార్కెటింగ్ జాబ్ చేసేవారికి జీతాల కన్నా కూడా ఇన్సెంటివ్ ల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. అయితే కంపెనీలు ఇప్పుడు వాటిని ఇవ్వడం ఆపేస్తుండటంతో మార్కెటింగ్ రంగాన్ని విడిచిపెట్టి ఉద్యోగులు ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు. గతేడాది సిటీలో 6 లక్షల మందికిపైగా మార్కెటింగ్ఉద్యోగాలు చేసేవారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో కొంత కొంత తగ్గుతూనే ఉన్నారు. ప్రస్తుతం 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగులు మార్కెటింగ్ ఫీల్డ్‌ను వదిలి ఇతర
ఉద్యోగాలు చేస్తున్నారు.
కొద్ది కొద్దిగా తగ్గించి చివరకు పూర్తిగా ఇవ్వట్లే..
ప్రతి కంపెనీలో ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది. అందులో పదుల సంఖ్యలో ఉద్యోగులుంటారు. వారికి కంపెనీలిచ్చే జీతాలతో పోలిస్తే అదనంగా వచ్చే ఇన్సెంటివ్లే ఎక్కువ ఉంటాయి. అందుకే ఆ జాబ్ లో ఎంత ఒత్తిడి ఉన్నా ఆదాయం అధికంగా ఉంటుందనే కారణంతో చాలామంది మార్కెటింగ్ రంగంలో పనిచేస్తుంటారు. సిటీలోని పలు కంపెనీలు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైమ్ లో చాలావరకు మార్కెటింగ్ ఉద్యోగులను తీసేశాయి. సెకండ్ వేవ్ లో ఇన్సెంటివ్స్లో కోతలు విధించాయి. థర్డ్ వేవ్ వచ్చాక 60 శాతం కంపెనీలు పూర్తిగా ఇన్సెంటివ్స్ ఇవ్వడమే మానేశాయి. దీంతో ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. వస్తున్న జీతంతో పనిచేయలేక.. ఇన్సెంటివ్ లు ఇవ్వాలని కంపెనీలను అడిగి అడిగి విసిగిపోయిన ఉద్యోగుల్లో చాలమంది మార్కెటింగ్ సెక్టార్ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. అరకొర జీతాలతో అంత ప్రెజర్ అనుభవిస్తూ పనిచేయలేమని అందుకే ఉద్యోగాలను మానేస్తున్నామని మార్కెటింగ్ జాబ్ నుంచి బయటకు వచ్చేసిన పలువురు ఉద్యోగులు చెప్తున్నారు.
రూట్ మార్చుతున్నరు....
కంపెనీలు ఇన్సెంటివ్‌లను ఇవ్వబోమని చెబుతుండటంతో ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. రెండు నెలలుగా ఇతర ఉద్యోగాల వేటలో పడ్డారు. అందులో భాగంగా చాలామంది వేరే కంపెనీల్లో జాయిన్ అవుతుండగా, మరికొందరు ఏకంగా ఓన్ గా బిజినెస్ మొదలుపెడుతున్నారు. ఇంకొందరు ఫ్రీ లాన్సర్లుగా మారిపోతున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హోటల్ ఇండస్ట్రీలతో పాటు తదితర రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్‌లో ఉద్యోగాలు చేసేందుకు ఇదివరకు చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవారు. జీతంతో పాటు ఇన్సెంటివ్స్ అదే తరహాలో వస్తుండటంతో ఉద్యోగాల కోసం క్యూ కట్టేవారు. కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం జీతాలపైనే ఆధారపడాల్సి రావడంతో ఈ రంగంలో పనిస్తున్న వారు ఉద్యోగాలను వదులుకుంటున్నారు. హోటల్ , రిసార్ట్ ఇండస్ట్రీలో ఉన్న వారిలో చాలా మంది ఫ్రీలాన్సర్లుగా మారుతున్నారు. జాబ్ మానేసిన కంపెనీలతో పాటు వేరే వాటితో కలిసి కమీషన్ బేస్ లో పనిచేసుకుంటున్నారు. శాలరీతో పోలిస్తే ఇలాగే ఎక్కువ ఇన్కమ్ వస్తుండటంతో ఫ్రీలాన్సర్లుగా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు.
బిజినెస్ లేకపోవడంతోనే..
ఆదాయం లేకపోవడంతోనే ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతుందని పలు కంపెనీలు నిర్వాహకులు అంటున్నారు. కస్టమర్లు లేనప్పుడు మార్కెటింగ్ అవసరం ఉండదని, అందుకనే ఈ సెక్టార్లో ఉద్యోగులు జాబ్ లను కోల్పోతున్నారన్నారు. తప్పని పరిస్తితుల్లో ఉద్యోగులను పక్కన పెట్టాల్సి వస్తుందంటున్నారు. సెకండ్ వేవ్ లో తొలగించిన వారిని థర్డ్ వేవ్ కి ముందు ఉద్యోగాల్లోకి తీసుకున్నందున ఇన్సెంటివ్స్ లో కోతలు విధించాల్సి వస్తుందని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తెలిపాడు. ఇలా అన్ని కంపెనీల్లో ఉద్యోగులపై ఇదే ప్రభావం పడుతోంది.
ఇన్సెంటివ్స్ తగ్గించాక..
సేల్స్ లో ఆరేండ్ల ఎక్స్పీరియన్స్ఉంది. ఓ ఈఎంఐ ఫైనాన్స్ కంపెనీలో జాబ్చేశా. శాలరీ రూ.15 వేలు ఉన్నా కూడా ఎలక్ట్రానిక్వస్తువుల సేల్స్‌ని బట్టి నెలకు మరో రూ.15 వేలు ఇన్సెంటివ్ వచ్చేది. కొంత కాలంగా కంపెనీ ఇన్సెంటివ్స్ ను తగ్గించి ఇస్తోంది. శాలరీ సరిపోక జాబ్ వదిలేసిన. మార్కెటింగ్ ఫీల్డ్ నుంచి బయటికొచ్చి ప్రస్తుతం ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా. - జగన్ యాదవ్, కూకట్ పల్లి
బిజినెస్ చేసుకుంటున్నా..
ఎలక్ట్రానిక్ స్టోర్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా చేశా. శాలరీలు పెంచకపోవడంతో పాటు ఇన్సెంటివ్స్ ను కూడా మేనేజ్మెంట్ ఒక్కసారిగా తగ్గించింది. దీంతో సొంతంగా బిజినెస్చేయాలని డిసైడ్ అయ్యా. వాటర్ ప్యూరీఫైర్స్ బిజినెస్పెట్టిన. జాబ్చేస్తున్నప్పటికంటే ఇప్పుడే బాగుంది. మార్కెటింగ్ జాబ్‌లు చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపట్లేదు. - దయాకర్, ఉప్పల్