కరోనా పోయింది... ఆఫీసులకెళ్లండి 

కరోనా పోయింది... ఆఫీసులకెళ్లండి 
  • ఐటీ, ఇతర సంస్థలు ఓపెన్ చేసుకోవచ్చు: డీహెచ్ శ్రీనివాసరావు 
  • విద్య, వ్యాపార సంస్థలను తెరవండి 
  • ఇకపై నార్మల్ లైఫ్ కొనసాగించొచ్చు 
  • వారం తర్వాత కేసులు రోజూ వందకు మించకపోవచ్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. మరో వారం తర్వాత ప్రతిరోజు వంద కేసులు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కరోనా ఆంక్షలేవీ అమల్లో లేవని.. ఇక నుంచి విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలన్నింటినీ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ కోఠిలోని కరోనా కంట్రోల్ రూమ్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఐటీ, ఇతర సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎత్తివేసి ఆఫీసులు ఓపెన్ చేయాలని సూచించారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ ఆన్‌‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయని, వెంటనే వాటిని బంజేసి.. ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలన్నారు. ఆన్‌‌లైన్ క్లాసులతో ఇప్పటికే పిల్లల చదువులు దెబ్బతిన్నాయని, వాళ్లను ఇంకా ఇంట్లోనే ఉంచితే మానసిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. స్టూడెంట్ల తల్లిదండ్రులు కూడా కరోనా ఆందోళనల నుంచి బయటకు వచ్చి, పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల ఒకటో తారీఖు నుంచే సర్కార్ విద్యాసంస్థల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయని.. ఇప్పటి వరకు ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పారు.  ప్రజలు కరోనాకు భయపడకుండా మాస్క్, సోషల్ డిస్టెన్స్ రూల్స్ మాత్రం పాటించాలని సూచించారు.  

రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్‌‌‌‌ పోయినేడాది డిసెంబర్ 28న మొదలైందని, నెలన్నరలోనే ముగిసిందని డీహెచ్‌‌‌‌ తెలిపారు. జవవరి 25న అత్యధికంగా 4,559 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని చెప్పారు. ఫస్ట్‌‌‌‌ వేవ్‌‌‌‌ పీక్ స్టేజ్ 170 రోజుల్లో, సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ 55 రోజుల్లో నమోదవ్వగా, థర్డ్ వేవ్‌‌‌‌లో 28 రోజుల్లోనే పీక్ స్టేజ్ నమోదైందన్నారు. ఈ వేవ్‌‌‌‌ పీక్ స్టేజ్‌‌‌‌లో 5 శాతం పాజిటివిటీ నమోదవ్వగా, గరిష్టంగా 6.5 శాతం బెడ్లు నిండాయని వివరించారు. ఈసారి వైరస్ కట్టడిలో వ్యాక్సినేషన్ ఎంతో ఉపయోగపడ్డదన్నారు. టీకా తీసుకోని వాళ్లలో 2.8 శాతం మంది ఆస్పత్రుల్లో చేరగా, టీకా తీసుకున్నోళ్లలో ఒక్క శాతం మంది మాత్రమే ఆస్పత్రుల పాలయ్యారని చెప్పారు. ఐసీయూ, వెంటిలేషన్ కేసుల్లోనూ టీకా వేస్కోనోళ్లే ఎక్కువని తెలిపారు. బూస్టర్ డోసు తీసుకున్నోళ్లలో 0.07 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల పాలయ్యారన్నారు. వెంటిలేషన్(0.08 %), ఐసీయూ(0.03 %) కేసులు తక్కువేనని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు ఎవరైనా ఉంటే, ఇప్పటికైనా వేయించుకోవాలని సూచించారు. ఈసారి ఫీవర్ సర్వేలో 15.72 లక్షల మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చామని వెల్లడించారు. మరిన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోందన్నారు. 

ఇప్పట్లో కొత్త వేరియంట్లు రావ్... 
ఇప్పుడున్న అంచనాల మేరకు ఇంకొంత కాలం వరకు కొత్త వేరియంట్లు పుట్టే అవకాశం లేదని, ప్రజలు సాధారణ జీవనం గడపొచ్చునని డీహెచ్ చెప్పారు. పబ్లిక్ హెల్త్ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌, ఎపిడమాలజిస్టులు మూడు రకాల అంచనాలు వేశారని తెలిపారు. కరోనా పూర్తిగా ఎండెమిక్‌‌‌‌గా మారిపోయి సాధారణ, సీజనల్ ఫ్లూగా మిగిలిపోవడం ఒకటైతే.. కొంతమందిలో కొత్త వేరియంట్లు ఇమ్యూనిటీని తగ్గించి, మాటిమాటికి  వైరస్ బారిన పడేలా చేయడం మరొకటని అన్నారు. ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌‌‌‌ను దాటి ఇన్‌‌‌‌ఫెక్ట్ చేసే కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. అయితే, అవన్నీ వీక్‌‌‌‌ వేరియంట్లయ్యే చాన్స్ ఉందన్నారు. అన్ని రకాల వేరియంట్లకు పనిచేసే వ్యాక్సిన్ల తయారీ కోసం ఫార్మా కంపెనీలు పని చేస్తున్నాయని, అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.  

మేడారం జాతరకు వెళ్లండి..  
కరోనా గురించి భయపడకుండా భక్తులందరూ మేడారం జాతరకు వెళ్లాలని డీహెచ్ సూచించారు. ప్రపంచాన్ని రెండేండ్ల నుంచి పీడిస్తున్న కరోనా పీడ విరగడవ్వాలని అమ్మవార్లను వేడుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లను, సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. 150 బెడ్లతో టెంపరరీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కాలేజీకి వెళ్లే యువతులకు ఫ్రీగా స్కూటీలు ఇస్తం