- 13 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లు నమోదు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రమంతటా ఇగం పట్టింది. జిల్లాలు చలితో వణికిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆరేడు డిగ్రీలకు పడిపోయాయి. ఇటు దక్షిణాది జిల్లాల్లోనూ క్రమక్రమంగా చలి ఎక్కువైతున్నది. శనివారం రాత్రి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 13 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే నమోదు కావడం చలి తీవ్రత ఎంత పెరిగిందో స్పష్టం చేస్తున్నది. మరో 16 జిల్లాల్లో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మిగతా నాలుగు జిల్లాల్లోనూ 15 లోపే రికార్డవడం గమనార్హం.
ఏజెన్సీలు గజగజ
ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ఏజెన్సీలు చలికి గజగజలాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టీ) గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా మామడలో 6.6, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 6.7, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.8 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డయ్యాయి.కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 7.6, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7.7, మెదక్ జిల్లా శివంపేటలో 8, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 8, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 8.2, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 8.6, సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లిలలో 8.6, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.9, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 9.5 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. మరో ఐదు జిల్లాలు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, ములుగు, వరంగల్ జిల్లాల్లో 10 డిగ్రీల నుంచి 10.7 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
భారీగా పడిపోయినయ్
గతేడాది అదే రోజుతో పోలిస్తే ఇప్పుడు టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. దక్షిణాదిలోని ఆరేడు జిల్లాలను మినహాయిస్తే మిగతా జిల్లాల్లో నిరుడు నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇప్పుడు 4 డిగ్రీల నుంచి 6 డిగ్రీల మధ్యలో డ్రాప్ అయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లోని సెంట్రల్ పార్ట్స్‌తో పోలిస్తే శివార్లలోని ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రంగా ఉన్నది. రాష్ట్రంలో మరికొన్నాళ్లపాటు ఇదే పరిస్థితులుండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాదితో పాటు కొన్ని దక్షిణాది జిల్లాల్లోనూ చలి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొంది. హైదరాబాద్ సిటీలో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.
జర పైలం!
రాష్ట్రంలో మరికొన్నాళ్ల పాటు ఇదే పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పొగమంచు దట్టంగా ఉండే తెల్లవారుజాము, ఉదయం వేళల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. వెళ్లాల్సి వస్తే వాహనాలను జాగ్రత్తగా నడపాలని చెబుతున్నారు. పొగమంచులో ఎదురుగా వచ్చే లేదా.. మన ముందు వెళ్లే వాహనాలు కనిపించవు. ఫలితంగా ప్రమాదాల బారిన పడే ముప్పు ఉంటుంది. కనుక వీలైనంత వరకు పొగమంచు సమయంలో ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిది. ఇక, చలి నుంచి కాపాడుకునేలా వెచ్చటి దుస్తులను ధరించాలి. స్వెటర్లు, మఫ్లర్ల వంటి వాటిని వాడాలి. చన్నీటి స్నానాన్ని దూరం చేయండి. శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపించే చల్లటి పానియాలు, ఐస్‌క్రీమ్‌ల వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.