ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో .. బెయిల్ కోసం సుప్రీం కోర్టుకెళ్లిన తిరుపతన్న

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న అడ్వొకేట్ మోహిత్ రావు ఆయన తరఫున పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్​లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న కోరారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్​తో కూడిన బెంచ్ గురువారం ఈ పిటిషన్​ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున మోహిత్ రావు వాదనలు వినిపించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 23న తిరుపతన్న అరెస్ట్ అయ్యారు.

211 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు. చార్జ్​షీట్ దాఖలు చేసి కూడా మూడు నెలలైంది’’అని అడ్వొకేట్ మోహిత్ రావు తెలిపారు. బెంచ్ జోక్యం చేసుకుని... ‘‘అసలు 211 రోజుల నుంచి నిందితుడు జైల్లో ఎందుకు ఉన్నారు?’’అని అడ్వొకేట్​ను బెంచ్ అడిగి తెలుసుకున్నది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.