కేవైసీ అప్ డేట్ అంటూ సినీ నటుడిని మోసం చేశారు

సోషల్ మీడియా వచ్చాక సైబర్ మోసాలు మరింత పెరిగాయి. సామాన్యులే కాదు కొన్ని సార్లు సెలబ్రిటీలు కూడా ఈ ఉచ్చులో పడిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసాని కేవైసీ మోసంలో బాధితుడయ్యాడు, భారీ మొత్తాన్ని కోల్పోయాడు.

కేవైసీ వివరాలను బ్యాంక్‌కి లింక్ చేయకపోతే, బ్యాంక్ ఖాతా సస్పెండ్ చేయబడుతుందని హెచ్చరిస్తూ శివదాసానికి ఓ తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో అయన ఆ లింక్‌ని క్లిక్ చేసి, సూచనలను అనుసరించాడు. ఆ తరువాత, అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ. 1లక్షా 49వేల 999 డెబిట్ అయినట్లు అతనికి డెబిట్ మెసేజ్ వచ్చిందని ఓ నివేదిక తెలిపింది. ఈ ఘటన అక్టోబర్ 8న జరగగా.. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), 420 (చీటింగ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సెక్షన్లతో సహా సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలీవుడ్ నటులు సైబర్ మోసానికి గురవడం ఇదేం మొదటిసారి కాదు. 2022లో, ప్రముఖ నటుడు అన్నూ కపూర్ కేవైసీ మోసంలో రూ. 4.36 లక్షలు పోగొట్టుకున్నారు. 2016లో, నర్గీస్ ఫక్రీ ఆన్‌లైన్ క్రెడిట్ కార్డ్ మోసంలో సుమారు రూ. 6 లక్షలు పోగొట్టుకుంది. మోసగాళ్లు మొదట మొత్తం సమాచారాన్ని కాపీ చేసి, ఆమె పేరుతో క్లోన్ క్రెడిట్ కార్డ్‌ను సృష్టించారని నివేదికలు చెబుతున్నాయి.

అఫ్తాబ్ శివదాసాని చివరిసారిగా 2021 డిస్నీ+హాట్‌స్టార్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ 1.5: ది హిమ్మత్ స్టోరీలో కనిపించారు. కొంతకాలం నుంచి ఆయన వెండి తెరకు దూరంగా కనిపిస్తున్నారు. అతను చివరి సారిగా థియేటర్లలో 2021లో వచ్చిన కన్నడ చిత్రం కోటిగొబ్బ 3 లో కనిపించారు.