ప్రముఖ ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ ఒక అద్భుతమైన ఫొటో తీసి తన 6ఏళ్ల కలను సార్థకం చేసుకున్నాజు. ఈ ఫొటో లక్షల్లో లైక్‌లను అందుకోవడమే కాకుండా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆమోదం కూడా పొందింది. టురిన్ నగరానికి చెందిన వలేరియో మినాటో అనే ఫొటోగ్రాఫర్.. చంద్రుడి ఫొటోను విస్మయం చెందే విధంగా క్లిక్ చేశాడు. ఎత్తైన మోన్‌విసో గోపురం పై భాగంలో చంద్రుడు గొడుగును పోలి ఉండేలా కనిపిస్తోన్న ఈ ఫొటోను నాసా సత్కరించింది.
తాను 2012 నుండి షూటింగ్ చేస్తున్నానని, మొదట టురిన్‌లో ఆ తరువాత చుట్టుపక్కల ప్రాంతాల్లో.. మొత్తం నగరాన్ని వివిధ పాయింట్లు, దూరాల నుండి వీక్షించేవాడినని వలేరియో మినాటో చెప్పాడు. 2017 నుండి మినాటో చంద్రుడిని సంగ్రహించే క్లిష్టమైన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. ఒక నిర్దిష్ట సమయంలో తాను మోన్‌విసో గోపురం ఖచ్చితంగా చంద్రుడు అసంపూర్ణం అయ్యే పాయింట్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ తన కల నిజం కాలేదు. కానీ అతను తన ఆశను కోల్పోలేదు.
మినాటో అలా తన ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. ఫైనల్ గా 6 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 15వ తేదీన, సాయంత్రం 7 గంటలకు అతని పట్టుదల ఫలించే సమయం వచ్చింది. ఆకాశం క్లియర్ అయింది. అతను ఎంతో కాలంగా ఊహించిన ఖచ్చితమైన స్థానానికి చంద్రుడు చేరుకున్నాడు. తన కెమెరా కూడా ఆ సమయంలో సిద్ధంగా ఉండటంతో, మినాటో ఆ క్షణాన్ని తన కెమెరాలో బంధించాడు. చంద్రుడు, బాసిలికా గోపురంతో సమలేఖనం చేసిన ఖచ్చితమైన క్షణాన్ని సంగ్రహించే టైమ్-లాప్స్ వీడియోను కూడా అతను పంచుకున్నాడు. ఈ క్లిప్‌కి 1.9 లక్షల లైక్‌లు కూడా వచ్చాయి.
అలా పుట్టుకొచ్చిందే ఈ అందమైన ఫొటో. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.. ఈ ఫొటోకు ఆకర్షితులవుతోన్న నెటిజన్లు.. ఇది దశాబ్దం పాటు గుర్తుండిపోతుందని ప్రశంసించడం మొదలు పెట్టారు. అంతే కాదు డిసెంబర్ 15 సాయంత్రం 6.52 గంటలకు తీసిన ఈ ఫొటోను పది రోజుల తర్వాత నాసా.. క్రిస్మస్ 2023 సందర్భంగా "ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే"గా ఎంపిక చేసింది.
ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే (APOD)గా గుర్తించి ఫేస్‌బుక్‌లో ఈ ఫొటోను షేర్ చేసిన నాసా.. ఇలాంటి సింగిల్ షాట్‌లకు ప్లానింగ్ అవసరమని, అటువంటి అద్భుతమైన ట్రిపుల్-అలైన్‌మెంట్ వాస్తవానికి జరుగుతుందని గ్రహించడం మొదటి దశ అని చెప్పుకొచ్చింది. ఫొటోగ్రాఫ్ చేయడానికి ఉత్తమమైన స్థానాన్ని కనుగొనడం రెండవ దశ అయితే... సరిగ్గా సరైన సమయంలో అక్కడ ఉండటం... ఆకాశం స్పష్టంగా ఉన్నప్పుడు తీయడమనేది మూడో దశ అని.. ఇది నిజంగా చాలా కష్టతరమైనదని కొనియాడింది.