
సోషల్ మీడియా వచ్చాక విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లు లేటెస్ట్ ట్రెండ్ గా మారాయి. ఫైర్ దోశ, లాలీపాప్ ఇడ్లీ... ఇలా చాలా వైరల్ అయిన ఆహారపదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి జాబితాలోకి మిర్చి ఐస్ క్రీమ్ రోల్ కూడా చేరింది. ఈ ఐస్ క్రీమ్‌ను పచ్చిమిర్చి తరుగులు, నుటెల్లా క్రీమ్ కలిపి చేస్తారు. రోడ్డు సైడ్ బండిపై ఈ ఐస్ క్రీమ్‌ను తయారుచేసి అమ్ముతున్నారు. దీనికి స్థానికంగా భలే డిమాండ్ ఉంది.
ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్‌ను పచ్చి మిర్చితో తయారు చేశాడు (Ice creams with green chillies). పచ్చి మిరపకాయలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ రోల్‌ను ఎలా తయారు చేయాలో చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.
thehungrysurati అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో ఆగస్టు 11న షేర్ అయింది. సూరత్ (Surat)లోని ఓ దుకాణంలో ఓ వ్యక్తి చిల్లీ రోల్ ఐస్‌క్రీం (Chilli Roll Ice Cream) తయారు చేశాడు. పచ్చి మిరపకాయలను ఉపయోగించి ఆ వ్యక్తి ఐస్‌క్రీమ్ రోల్స్ తయారు చేశాడు. చాలా ఘాటుగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను ప్లేట్‌లో వేసి అందించాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో ఐస్‌క్రీమ్ కు మిరపకాయలను కోసి చల్లి, దానిపై నుటెల్లాను జోడించడం చూడవచ్చు. ఆ మిశ్రమానికి మిల్క్ క్రీమ్ పోసి బాగా కలిపి, చివరికి రోల్ లా చేసి ఫ్రీజర్ లో పెడుతున్నారు. చివర్లో మళ్లీ దాన్ని పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసి అందిస్తున్నారు.
ఈ ఐస్ క్రీమ్ తయారీ వీడియో... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బాబోయ్.. ఈ ఐస్‌క్రీమ్‌ను ఎలా తినాలని పోస్ట్ చేయగా మరొకరు ఇదెక్కడి పైత్యం రా బాబూ అని కామెంట్ పెడుతూ.. ఇన్‌స్టాగ్రామ్ డిస్‌లైక్ బటన్‌ను కూడా అందించాలని రాసుకొచ్చారు. ఇంకొకరు స్పైసీ ఫుడ్ తినేవారు ఐస్‌క్రీమ్ ఎందుకు తినాలని రాశారు. డబ్బు వృథా ఆపాలంటూ... దీన్ని తినడం కంటే కాస్త విషం తాగడం బెటర్ అని చాలా మంది కామెంట్లు చేశారు. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ ను చూసి చాలా మంది అసహ్యించుకున్నారు. ఒక నెటిజన్ మనకు ఫుడ్ అబ్యుజ్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా చాలా అవసరం అని కామెంట్ చేశారు. ‘అల్లం వెల్లుల్లి కూడా జోడించండి’ అని మరొక వ్యక్తి వెటకారంగా రాసుకొచ్చాడు.