లా ఒపాల.. మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో మహిళలకు ఈ బ్రాండ్ వస్తువులు పరిచయమే. ఈ కంపెనీ తయారు చేసే ప్లేట్లు, గ్లాస్‌లు తమ డైనింగ్ టేబుల్ మీద ఉండాలని చాలామంది అనుకుంటారు. మార్కెట్‌లో ఎన్నో రకాల కంపెనీలు డైనింగ్ సెట్లు తయారుచేస్తున్నా లా ఒపాల కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్‌లో ముందుంటోంది. అంతేకాదు.. 24 శాతం లెడ్ క్రిస్టల్ టేబుల్ వేర్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్న మొదటి ఇండియన్ కంపెనీ ఇదే.
మన దేశంలోనే ఫేమస్ టేబుల్‌వేర్ ప్రొడ్యూసర్‌గా ఎదగడానికి లా ఒపాల కంపెనీకి చాలా ఏండ్లు పట్టింది. అందుకోసం ఎంతోమంది కృషి చేశారు. ముఖ్యంగా దీని వ్యవస్థాపకుడు సుశీల్ జున్‌జున్‌వాలా ఈ కంపెనీని నిలబట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సుశీల్ జున్‌జున్‌వాలా కుటుంబం మొదట్లో రోడ్ల పక్కన టీ అమ్మే గాజు గ్లాసులను తయారు చేసేది. సుశీల్ ఆ బిజినెస్ నుంచి తప్పుకుని కొత్త బిజినెస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కొత్త బిజినెస్ ఐడియా కోసం1985లో సౌత్ కొరియా వెళ్లాడు. అక్కడ మిల్కీ వైట్ గ్లాస్, ఒపల్ వేర్‌తో తయారు చేసే వస్తువుల గురించి తెలుసుకున్నాడు. అప్పటికి ఇండియాలో అలాంటి ప్రొడక్ట్స్ అంతగా లేవు. మన దగ్గర ఈ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతుందని బాగా నమ్మాడు.
దాంతో వెంటనే అక్కడి నుంచి ఇండియాకు వచ్చి మార్కెట్‌లో ప్రొడక్ట్స్ గురించి రీసెర్చ్ చేశాడు. చాలామంది స్నేహితులు, వ్యాపారుల సలహాలు తీసుకున్నాడు. అందరూ ఈ బిజినెస్ గురించి పాజిటివ్‌గానే మాట్లాడారు. కానీ.. వాటిని తయారు చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. దాంతో టెక్నికల్ పార్ట్‌నర్ కోసం మళ్లీ దక్షిణ కొరియాకు వెళ్లాడు. అక్కడ ‘హోసన్ గ్లాస్’ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. ఇక మిగిలింది ప్రొడక్షన్ మొదలుపెట్టడమే.1988లో సుశీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అనువైన స్థలాన్ని వెతకడం మొదలుపెట్టాడు. జార్ఖండ్‌లోని మధుపూర్‌లో ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ముందుగా లా ఒపాల ప్రొడక్ట్స్ కోసం ఒక చిన్న మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేశాడు.
రిస్క్ ఎక్కువే
ఫ్యాక్టరీ చిన్నదే అయినా.. అప్పట్లోనే దాని కోసం ఏకంగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. 80ల్లో రెండు కోట్లు అంటే మాటలా! పైగా అప్పటికి ఇండియన్ మార్కెట్‌లో ఒపల్ క్రాకరీకి డిమాండ్ లేదు. అప్పట్లో అందరూ స్టెయిన్‌లెస్ స్టీల్ టేబుల్‌వేర్‌నే ఎక్కువగా వాడేవాళ్లు. డబ్బులు కాస్త ఎక్కువగా ఉన్నవాళ్లు వెండితో చేసిన వస్తువులు వాడేవాళ్లు. అందుకే మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. ఆకట్టుకునే డిజైన్స్, సరైన ప్యాకేజింగ్, పూర్తి స్థాయి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వల్ల ప్రొడక్ట్స్ జనాల్లోకి వెళ్లగలిగాయి.
ఇదంతా బాగానే ఉన్నా.. కంపెనీ పెట్టిన మొదట్లో చాలామంది ప్రజలు దీనిని విదేశీ ప్రొడక్ట్ అనుకున్నారు. కొంతమంది అయితే.. కేవలం విదేశీ వస్తువులు అని భావించడం వల్లే కొనేవాళ్లు. ఆ అపోహ కూడా కంపెనీకి ప్లస్ అయ్యింది. చివరకు మూడేండ్లు గడిచాక కంపెనీ లాభాల దారి పట్టింది. అంతేకాదు.. 1991లో కంపెనీ నుంచి ప్రొడక్ట్స్‌ని విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయడం కూడా మొదలైంది.
మరో ఫ్యాక్టరీ
సంప్రదాయ స్టీల్ ప్లేట్లు వాడేవాళ్లలో చాలామంది లా ఒపాల ప్రొడక్ట్స్‌కి మారారు. అదేటైంలో కంపెనీ మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా తక్కువ ధరలో ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేసింది. దాంతో లా ఒపాల క్రాకరీ కొన్ని లక్షల ఇండ్లకు చేరింది. అమ్మకాలు ఎక్కువ కావడంతో ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే యాజమాన్యం మరో ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అయ్యింది. కానీ.. అందుకు కావాల్సిన పూర్తి డబ్బు లేదు. అందుకే నిధుల కోసం1995 లో కంపెనీని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేశారు.
ఆ మరుసటి ఏడాది మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఈ సారి సౌత్ కొరియాలోని ‘డూసన్ గ్లాస్’ కంపెనీ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు. అందువల్ల 24 శాతం లెడ్ క్రిస్టల్ గ్లాస్‌వేర్ రేంజ్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్‌లోకి తేగలిగారు. ఆ తర్వాత కొన్నేండ్లలో కంపెనీ లాభాలు బాగా పెరిగాయి. కంపెనీ ప్రతి ఏడాది దాదాపు 50–60 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టగలిగింది.
యూరోపియన్ టెక్నాలజీ
మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని మరింత పెంచాలి అనుకుంది. అప్పటివరకు సెమీ ఆటోమెటిక్ పద్ధతిలో ప్రొడక్షన్ జరిగేది. క్రిస్టల్ మేకింగ్ కోసం చేతితో కత్తిరించడం, నోటితో -ఊదడం లాంటివి చేసేవాళ్లు. కానీ.. ఆ తర్వాత 2007లో యూరోపియన్ టెక్నాలజీని వాడి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో పూర్తి ఆటోమేటిక్ ఒపల్ గ్లాస్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అందుకోసం పెద్ద రిస్క్ తీసుకున్నారు. కొత్త ప్లాంట్ కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. కానీ.. సమష్టి కృషి వల్ల ఆ పెట్టుబడి అంతా రిటర్న్స్ రూపంలో వచ్చేసింది.
ఈ ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీ వృద్ధి విపరీతంగా పెరిగింది. ఈ ప్లాంట్ వల్ల తయారీ ఖర్చు భారీగా తగ్గింది. దాంతో తక్కువ ధరలకే ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి తేగలిగారు. అప్పుడే ‘దివా’ పేరుతో ఒక సబ్ బ్రాండ్‌ని కూడా తెచ్చారు. ఈ బ్రాండ్ కింద 20–25 శాతం ప్రీమియం టేబుల్‌వేర్ అమ్ముతున్నారు. అప్పటినుంచి మార్జిన్‌లు కూడా పెరిగాయి. దాంతో ప్రింట్ మీడియా, టీవీల్లో యాడ్స్ ఇవ్వడం మొదలైంది.
అప్పటివరకు ప్రతి ఏడాది 4 శాతం పెరిగే అమ్మకాలు 2008లో ఏకంగా 13–14 శాతానికి పెరిగాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ సితార్‌గంజ్ ప్లాంట్ కెపాసిటీని పెంచుతూ వచ్చింది. దీని కెపాసిటీ మొదట్లో 4,000 మెట్రిక్ టన్నులు ఉండేది. ఇప్పుడు 16,000 మెట్రిక్ టన్నులకు చేరింది.
మార్కెట్
ప్రస్తుతం ఈ కంపెనీకి ఇండియా అంతటా సప్లయర్స్, కొన్ని వేల మంది రిటైల్ పార్ట్‌నర్స్ ఉన్నారు. అంతేకాదు.. ఆన్‌లైన్ మార్కెట్‌లో కూడా కంపెనీ పట్టు సాధించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ–కామర్స్ సైట్లలో ప్రొడక్ట్స్ అమ్ముతోంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో 4-5 శాతం వాటా ఇ–కామర్స్‌దే. మన దేశంతోపాటు మిడిల్ ఈస్ట్ ఏసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కంపెనీ ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయి. ఉత్పత్తుల్లో దాదాపు15 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
చైనా నుంచి పోటీ
ఇప్పుడు లా ఒపాల కంపెనీ తయారుచేసే క్రాకరీలను ఇండియాలో ఇతర కంపెనీలు కూడా తయారుచేస్తున్నాయి. కానీ.. వాటి నుంచి వచ్చేపోటీ వల్ల కంపెనీకి పెద్దగా నష్టం ఉండదు. ఎందుకంటే.. ఆ కంపెనీల ప్రొడక్ట్స్ లా ఒపాల ధరలకు దగ్గరగానే ఉంటాయి. కానీ.. కొన్నేండ్ల నుంచి చైనా నుంచి దిగుమతి అవుతున్న ఒపల్ క్రాకరీలు 10 నుంచి 15 శాతం తక్కువ ధరకే మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అందువల్ల కంపెనీ అమ్మకాలు తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. కానీ.. కంపెనీకి ఉన్న స్ట్రాంగ్ నెట్‌వర్క్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, జనాల్లో లా ఒపాల బ్రాండ్‌కు ఉన్న పేరు వల్ల తక్కువ టైంలోనే మళ్లీ పుంజుకోగలదు.
పేరు ఎలా వచ్చింది?
ఒపల్ అనేది ఒకరకమైన100శాతం గాజు పదార్థం. ఇది పూర్తిగా తెల్లగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఇంట్లో వాడే వస్తువులను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. ఈ గ్లాస్‌తోనే లా ఒపాల కంపెనీ ఉత్పత్తులు తయారవుతాయి. అందుకే కంపెనీకి లా ఒపల్ అని పేరు పెట్టారు. ఇది పారదర్శకంగా ఉండదు. పైగా వేడి- నిరోధక పదార్థం-లా పనిచేస్తుంది. ఈ ఒపల్ గ్లాస్‌ను మొదటగా ఫ్రాన్స్‌లో ఉత్పత్తి చేశారు.