ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి, భారత సంతతి యువకుడు సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. నవంబర్ 26న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్‌లోనే అతడు విగతజీవిగా కనిపించాడు. చాట్‌జీపీటీ మాతృ సంస్థ 'ఓపెన్ ఏఐ' సమాజానికి హాని కలిగిస్తోందని వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే అతను శవమై కనిపించాడు. అతని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.
సుచిర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాము ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ను నియమించుకొని రెండోసారి శవపరీక్ష చేశామని.. ఆ ఫలితాలు పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని ఆమె వెల్లడించారు. తమ కుమారుడి మరణంపై FBI దర్యాప్తు అవసరమని ఆమె అన్నారు. ఆ పోస్ట్‌ను పూర్ణిమారావ్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు.
సుచిర్ తల్లి ఎక్స్(X)లో షేర్ చేసిన పోస్ట్‌పై ఎలాన్ మస్క్ స్పందించారు. సుచిర్ బాలాజీ మరణం ఆత్మహత్యలా అనిపించడం లేదని అన్నారు.
This doesn’t seem like a suicide
— Elon Musk (@elonmusk) December 29, 2024
అందుకు సుచిర్ బాలాజీ తల్లి పూర్ణిమారావ్.. "దయచేసి మాకు మద్దతు ఇవ్వండి, ఎలాన్ మస్క్" అని మరో ట్వీట్ చేశారు.
@elonmusk please support us
— Poornima Rao (@RaoPoornima) December 29, 2024
భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ.. నాలుగేళ్ల పాటు 'ఓపెన్ ఏఐ (Open AI)' బృందంలో పనిచేశారు. ఈ ఏడాది ఆగస్టులో అతను తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సుచిర్ బజాజీ OpenAI కాపీరైట్ డేటాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. చాట్‌జిపిటి వంటి సాంకేతికతలు ఇంటర్నెట్‌ను దెబ్బతీస్తున్నాయి అని అన్నారు. ఇలా వ్యాఖ్యానించిన నెల రోజుల్లోనే అతడు శవమై కనిపించాడు.