ఈ ఎన్నికలు మమతకు చాలేంజే

పశ్చిమబెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. మమతా వర్సెస్ బీజేపీగా ఇక్కడ పోరు కనిపిస్తోంది. కానీ, పదేండ్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీకే ఎక్కువ సవాళ్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ వలసలతో బలపడి మమతతో సై అంటే సై అంటోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీని మమత నిలువరించగలుగుతారా? తన పట్టును నిరూపించుకుంటూ మళ్లీ అధికారం చేపడతారా? మిగిలిన ఈ 50 రోజులే మమత ఫ్యూచర్ను డిసైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలక స్థానం సంపాదించిన రాష్ట్రం పశ్చిమబెంగాల్. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న మేజర్ ఎన్నికలు కావడంతో ఇవి అటు బీజేపీ, ఇటు ప్రతిపక్షాల పనితీరుకు రిఫరెండమ్గా నిలవనున్నాయి. పదేండ్ల క్రితం, బెంగాల్లో అసలు బీజేపీ ఉనికే లేదు. కానీ, ఇప్పుడు బీజేపీ మమతకు తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చే ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 ఎంపీ స్థానాలకుగానూ 18 సీట్లలో గెలిచిన బీజేపీ దేశానికి షాక్ ఇచ్చింది. ఒకవేళ ఇప్పుడు బెంగాల్లో బీజేపీ కనుక విజయం సాధించినట్లయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందు చాలా చిన్న చాలెంజ్లే మిగులుతాయి. ఒకవేళ, బెంగాల్లో బీజేపీ ఓడినట్లయితే ప్రతిపక్షాలను ఏకం చేసే అవకాశం మమతాబెనర్జీకి దక్కుతుంది. అదే జరిగితే ప్రధాని మోడీకి అసలైన ఇబ్బందులు మొదలైనట్లే. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన బీజేపీకి షాక్ ఇచ్చింది. ఒకవేళ మమత ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే ఆమె ఏం చేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి? ప్రస్తుతం మమతా బెనర్జీ చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాంటి వారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ.. తన ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నారు. అందువల్లే నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి సీటులో దాదాపు 20 ఏండ్లుగా కొనసాగుతున్నారు. పట్నాయక్ బీజేపీకి మిత్రపక్షంగా లేరు. అలాగే ప్రధాని మోడీపై విమర్శలు చేయలేదు. ఎన్నోసార్లు పార్లమెంట్లో బీజేపీని సపోర్ట్ చేశారు. 

మమతకు ఎదురయ్యే సవాళ్లు ఇవే..
మమతా బెనర్జీ ప్రజల అటెన్షన్ను కోరుకుంటున్నారు. ప్రత్యర్థులపై బహిరంగంగానే విరుచుకుపడుతుంటారు. కానీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా, మమతా బెనర్జీ చాలా సీరియస్ చాలెంజ్లు ఎదుర్కొంటున్నారు. 

సొంత సీట్లో గెలవాలి. మమతా బెనర్జీ ఈసారి సువేందు అధికారికి వ్యతిరేకంగా నందిగ్రామ్లో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సువేందు బెంగాల్కు చెందిన చాలా పాపులర్ లీడర్. ఆయనే బీజేపీ క్యాండిడేట్. సువేందు ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. బ్యాచిలర్. పాలిటిక్స్కే పూర్తిగా అంకితమయ్యారు. బెంగాల్లో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. అక్కడి కీలక నేతలంతా బ్యాచిలర్సే. అజయ్ ముఖర్జీ, ఇంద్రజిత్ గుప్తా, ప్రమోద్ దాస్ గుప్తా ఇంకా చాలా మంది బ్రహ్మచారులే. మమతకు ఫస్ట్ చాలెంజ్ నందిగ్రామ్లో విజయం సాధించడమే. తెలుగు రాష్ట్రాల మాదిరిగా కాకుండా.. బెంగాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు గొప్పగా పాలన సాగించకపోతే అక్కడి ప్రజలు వారిని ఓడిస్తారు. 2011లో సిట్టింగ్ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మమత పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం ఆ ప్రాంతంపై ప్రేమతో కాదు.. సువేందు అధికారిపై రివెంజ్ తీర్చుకోవడానికే.

మమత ఎదుర్కొంటున్న రెండో చాలెంజ్.. ఆమె పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించడం. ఆమె పార్టీ 147 ఎమ్మెల్యే సీట్లలో కచ్చితంగా గెలవాలి. లేదంటే సపోర్ట్ కోసం ఆమె ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది. బీజేపీ ఇంతగా బలపడకపోయి ఉంటే ఆమెకు ఇదో పెద్ద చాలెంజ్గా ఉండేది కాదు. 

ఇక మూడో చాలెంజ్ ముస్లిం పార్టీలు పోటీ చేయడం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ముస్లిం పార్టీలు ఎన్నికల బరిలో నిలబడుతున్నాయి. బెంగాల్ ఓటర్లలో ముస్లింల సంఖ్య 27 శాతం వరకూ ఉంటుంది. అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ముస్లిం పార్టీలు కచ్చితంగా కొంత భాగం ముస్లిం ఓట్లను సాధిస్తాయి. అదే జరిగితే మమతా బెనర్జీకి నష్టం జరుగుతుంది. ఇక్కడ మమతా బెనర్జీ ఎదుర్కొనే సమస్య ఏమిటంటే యాంటీ హిందూ కలర్ పడకుండా ఆమె ముస్లిం ఓటర్లను ఆకర్షించగలగాలి. కేరళలో మాదిరిగానే ముస్లిం పార్టీలు పవర్లో వాటా కోరుకుంటున్నాయి.

నాలుగో చాలెంజ్.. కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు బెంగాల్ను దాదాపు 60 ఏండ్ల పాటు పాలించాయి. కానీ, మమతా బెనర్జీ పార్టీ, బీజేపీ కలిసి ఆ రెండు పార్టీల ఓటు బ్యాంక్ను పది శాతానికి పరిమితం చేశాయి. కానీ, వాళ్లు సాధించే ఓట్లు ముఖ్యంగా ముస్లింల ఓట్లు, మమతా బెనర్జీకి ఎక్కువ నష్టం చేకూర్చేవే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కూటమి మమతా బెనర్జీకి పెద్ద ముప్పు.

మమతా బెనర్జీ పదేండ్ల పాటు అధికారంలో ఉండటంతో సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది. మమతా బెనర్జీ గొప్ప పొలిటీషియన్ అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ, తాను అడ్మినిస్ట్రేషన్లో పూర్ అని తనకు తానే నిరూపించుకుంటోంది. ఈ పదేండ్లలో బెంగాల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించలేదు. ఇదే ఆమెకు అతి పెద్ద సమస్య. టైం మారింది. ఇప్పుడు జనాలు మంచి పాలన కోరుకుంటున్నారు. అందువల్ల మమత తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 

నరేంద్రమోడీ ఇమేజ్. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ను కూడా ఫేస్ చేయాల్సి వస్తోంది. బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా బలపడింది. మమతా బెనర్జీ.. మార్పు అనే డిమాండ్ను ఎదుర్కొంటున్నారు. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. మమతా పార్టీ నుంచి వేలాది మందిని తమ పార్టీలో చేర్చుకుంటోంది. 

దాదాపు 500 ఏండ్ల క్రితం షేక్స్పియర్ ‘రివెంజ్ ఈజ్ బెస్ట్ వెన్ ఇట్ ఈజ్ డన్ ఇన్ కోల్డ్ బ్లడెడ్’అనే మాట చెప్పారు. బెంగాల్లో మమతా బెనర్జీని శిక్షించాలని ఎంతో మంది ప్రజలు, పార్టీలు కోరుకుంటున్నాయి. రాబోయే 50 రోజులు మమతా బెనర్జీ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తాయి. ఒకవేళ మమత పూర్తి మెజారిటీ సాధించలేకపోతే.. కాంగ్రెస్పై ఆధారపడాల్సి వస్తుంది. ఇది కాంగ్రెస్కు బూస్ట్లా పనిచేస్తుంది. అదే బీజేపీ విజయం సాధిస్తే.. 2024 ఎన్నికలు ఆ పార్టీకి ఈజీగా మారతాయి.

ఇప్పటికీ మమతకు చాన్సులు ఉన్నాయ్
ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నా.. ఇప్పటికీ మమతా బెనర్జీకి కాస్త ఎడ్జ్ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల సర్వేలు మమతనే లీడింగ్లో ఉన్నారని చెబుతున్నాయి. కానీ, ఆ లీడ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వచ్చే ప్రశ్న ఒక్కటే. లెఫ్ట్, కాంగ్రెస్ ఓటర్లు మమతను ఓడించేందుకు బీజేపీకి ఓటు వేస్తారా అనేది? ఎందుకంటే బెంగాల్లో వాళ్లు దెబ్బతినడానికి మమతా బెనర్జీనే కారణం. అందువల్ల ఆమెపై రివెంజ్ తీర్చుకోవాలని కచ్చితంగా కోరుకుంటారు. కానీ, ఎన్నికల రోజు నాటికి మమత లీడ్ను బీజేపీ తగ్గించగలదా అనేదే ఇప్పుడు క్వశ్చన్. ఎలక్షనీరింగ్ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే ఓ అంచనాకు రావడం సరికాదు. 
- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్