బ క్రీద్ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైంది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను ఈద్ అల్-అధా అని కూడా పిలుస్తారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లింలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీన్నే ఖిబ్లా అని కూడా అంటారు.
పేదల కోసం తోచినంత సాయం
ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. ప్రాణత్యాగానికైనా వెనుకాడడని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం కేటాయిస్తారు. ఆకలి అనేది అందరికీ సమానమైనది. కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శక్తిని బట్టి దానధర్మాలు చేస్తూ కొంతలో కొంత మందికైన ఆకలి తీర్చగలిగాం అని సంతృప్తి చెందుతారు ముస్లిం సోదరులు. దానగుణం ముడిపడి ఉన్నదే మానవ ధర్మం. మతం ఏదైనా మానవత్వం గొప్పది. ఏ దేవుడైనా కోరుకునేది అందరూ మానవత్వంతో, దానగుణం, క్షమాగుణం, ప్రశాంతతతో జీవించాలనే కోరుకుంటారు. వాటిని ఆచరించాల్సిన బాధ్యత మనపైన ఉంది.
హజ్‌యాత్ర ప్రత్యేకం..
హజ్ తీర్థయాత్రకు వెళ్లినవారు మక్కా నుంచి మదీనాను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ ను జరుపుకుంటారు. ఈదుల్ జుహా అనేది మనిషి త్యాగ నిరతిని చాటిచెప్పే విషయం. ప్రవక్త ఇబ్రహీం తన కొడుకు అయిన ఇస్మాయిల్‌ను కత్తితో మెడను కోస్తున్నట్టు ఒక రోజు కళ వస్తే .. ఆ అల్లాహ్ తన కొడుకునే కోరుతున్నాడేమోనని భావించి.. తన కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇబ్రహీం త్యాగాన్నిమెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగం వద్దని ఏదైనా జీవిని బలి ఇవ్వాలని కోరతాడు. ఇబ్రహీం భక్తికి, త్యాగానికి గుర్తుగా ఆయనను సత్కరించేందుకే ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు.