- 2028 ఒలింపిక్స్‌లో అధికారికంగా చేర్చిన ఐఓసీ
- ఆటకు ప్రపంచ వ్యాప్తంగా పెరగనున్న ఆదరణ
- స్క్వాష్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ గేమ్స్‌కూ గ్రీన్ సిగ్నల్
ముంబై : మన దేశంలో అభిమానులు ఎంతగానో ప్రేమించే, ఓ మతంలా ఆరాధించే క్రికెట్ వరల్డ్ వైడ్ మరింత పాపులర్ అవ్వనుంది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఈ ఆట రీఎంట్రీ ఇచ్చింది. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ అధికారికంగా చేరింది. టీ20 ఫార్మాట్ క్రికెట్‌తో పాటు స్క్వాష్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్ (సిక్సెస్), ఫ్లాగ్ ఫుట్‌బాల్ గేమ్స్‌కు ముంబైలో సోమవారం జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 141వ సెషన్‌లో ఆమోదముద్ర లభించింది.
ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు మేరకు మూజువాణి ఓటు ద్వారా ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో చేరుస్తున్నట్టు ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ ప్రకటించారు. ఓటింగ్‌లో పాల్గొన్న 99 మంది ఐఓసీ మెంబర్స్‌లో ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. కొత్తగా ఎంచుకున్న ఐదు క్రీడలు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కి సరిగ్గా సరిపోతాయని థామస్ బాచ్ అన్నారు. అమెరికన్ క్రీడా సంస్కృతికి అనుగుణంగా ఉన్న ఈ గేమ్స్ 2028 ఎడిషన్‌ను ప్రత్యేకంగా చేస్తాయన్నారు. కాగా, క్రికెట్‌ను 2028 ఒలింపిక్స్‌లో మాత్రమే చేర్చామని బాచ్ స్పష్టం చేశారు. 2032 బ్రిస్బేన్ గేమ్స్, ఆ తర్వాతి ఎడిషన్లలో తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.
టీ20 ఫార్మాట్.. బీసీసీఐ సపోర్ట్‌తో ముందడుగు
వరల్డ్ వైడ్ క్రికెట్‌కు 250 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిలో 70 శాతం మంది ఇండియన్సే. కానీ, కామన్వెల్త్ దేశాల్లోనే ఎక్కువ పాపులర్ అవ్వడంతో ఒలింపిక్స్‌లో రీఎంట్రీకి అడ్డుగా మారింది. అయితే, టీ20ల రాకతో ఈ ఆట అనేక దేశాలకు విస్తరించడం, అదే సమయంలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే విషయంలో ఐసీసీకి బీసీసీఐ మద్దతు ఇవ్వడంతో 2028 గేమ్స్‌లో ఈ ఆటకు చోటు దక్కింది.
ఇది వరకు తమ స్వయంప్రతిపత్తికి ముప్పు వస్తుందన్న భయంతో బీసీసీఐ చాలా ఏండ్లు వ్యతిరేకత వ్యక్తం చేసింది. కానీ, తన వైఖరి మార్చుకొని 2021లో క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు మద్దతిచ్చింది. వీటికి తోడు అమెరికాలో క్రికెట్‌ను అభిమానించే ఆసియా దేశాల నుంచి చాలా మంది ప్రవాసులు ఉండటం, 2024లో టీ20 వరల్డ్‌కప్‌కు యూఎస్ ఆతిథ్యం ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అయింది.
బోర్డు, ఐసీసీ హర్షం
ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అధికారిక ఎంట్రీ లభించడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా హర్షం వ్యక్తం చేశారు. ‘2036 ఒలింపిక్స్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వాలన్న చొరవ ముంగిట మెగా గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడం గొప్ప విషయం. ఇండియా టీమ్‌కు ఇప్పటికే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. మెగా గేమ్స్‌లో చేరిక తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఖ్యాతి పెరుగుతుంది. అలాగే, ఆటకు గణనీయమైన ఆర్థిక బలం చేకూరనుంది’ అని షా అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీతో ప్లేయర్లు, ఫ్యాన్స్, వాటాదారులతో పాటు స్థానికులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రసార హక్కులకు రెక్కలు
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంతో ఆట మార్కెట్ పరిధి పెరగడంతో ప్రసార హక్కుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. ఇండియాలో ఐఓసీ ప్రసార ఒప్పందం విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం 15.6 మిలియన్ పౌండ్ల ఒప్పందం జరిగింది. 2028 ఎడిషన్‌కు 150 మిలియన్ పౌండ్లకు చేరే చాన్సుంది.
స్క్వాష్‌కు జోష్
స్క్వాష్‌ను తొలిసారి ఒలింపిక్స్‌లో చేర్చడం కూడా ఇండియాకు ప్లస్ పాయింట్ కానుంది. ఈ ఆటలో మన దేశం బలంగా ఉంది. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో రెండు టీమ్ గోల్డ్ సహా మన దేశానికి ఐదు మెడల్స్ లభించాయి.
తోడైన కోహ్లీ పాపులారిటీ
క్రికెట్ ఒలింపిక్స్‌లో రీఎంట్రీ ఇచ్చే విషయంలో టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ పరోక్ష పాత్ర పోషించాడు. వరల్డ్ వైడ్ అతనికి ఉన్న పాపులారిటీ ఓ కారణమైంది. ఈ విషయాన్ని ఐఓసీ సెషన్‌లో పాల్గొన్న ఇటలీ ఒలింపిక్ చాంపియన్ షూటర్, లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని స్వయంగా వెల్లడించారు. ‘వరల్డ్ వైడ్ 2.5 బిలియన్ల మంది అభిమానులతో ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడను స్వాగతిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం.
లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్‌ను ఎందుకు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. యూఎస్‌ఏలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే నిబద్ధత నిజమైనది. ఈ ఏడాది మొదలైన మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీతో ఈ ఆట ఆదరణ అంచనాలను మించిపోయింది. వచ్చే ఏడాది యూఎస్ఏ, వెస్టిండీస్‌లో టీ20 వరల్డ్ కప్ కూడా జరగనుంది. దీనికి తోడు యూత్‌కు నచ్చే గేమ్స్‌ను ఒలింపిక్స్‌లో ఉంచడానికి మేం బలమైన డిజిటల్ ఉనికిని కూడా గుర్తించాం. ఈ విషయంలో క్రికెట్ ఒక ప్రత్యేక వేదికను అందిస్తోంది. సోషల్ మీడియాలో ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న అథ్లెట్లలో నా ఫ్రెండ్ విరాట్ కోహ్లీ మూడో వ్యక్తి. తనకు 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
లె బ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ ముగ్గురి ఫాలోవర్లను కలిపినా దానికంటే ఇది ఎక్కువే. కాబట్టి లాస్ ఏంజెల్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఐఓసీ, క్రికెట్ కమ్యూనిటీ రెండింటికి మేలు చేస్తుంది. ముఖ్యంగా క్రికెట్‌కు దాని సాంప్రదాయ దేశాలకు మించి ఎదగడానికి ప్రపంచ వేదికను అందిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.
1900లో రెండు జట్లు.. ఒకే మ్యాచ్
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఇదే తొలిసారి కాదు. 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఇందులో ఇంగ్లండ్, ఫ్రాన్స్ రెండే టీమ్స్ బరిలోకి దిగగా.. ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరిగింది. చెరో 12 మంది క్రికెటర్లతో ఇరు జట్లు రెండ్రోజుల మ్యాచ్‌లో పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ నెగ్గిన ఈ గేమ్‌ను కనీసం 20 మంది కూడా చూడలేదు. అయితే, 128 ఏండ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ఆట గత దశాబ్దంలో చాలా పాపులర్ అయింది. 2028 ఒలింపిక్స్‌లో సూపర్ హిట్ అయ్యే చాన్సుంది.
తెరవెనుక మిథాలీ
ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ కోసం ఐసీసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ప్రసార హక్కుల రూపంలో వేల కోట్ల మార్కెట్ విలువతో పాటు యూనివర్సిటీ, పాపులారిటీ, లెగసీ (యూ.పి.ఎల్) అనే మూడు అంశాలతో 2028 గేమ్స్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీని ఒప్పించింది. ఇందులో ఇండియా విమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పెప్సికో మాజీ హెడ్ ఇంద్ర నూయి తెరవెనుక తమ వంతు సాయం చేశారు. గతేడాది డిసెంబర్‌లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మీటింగ్‌లో ఐసీసీ చైర్మన్ బార్క్‌లేతో పాటు ఇంద్ర నూయి. మిథాలీ తదితరులు ఐఓసీ, గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీకి ఇచ్చిన ప్రెజెంటేషన్లు కీలకం అయ్యాయి.