- ప్రధాని మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిండు
- మీడియాతో ఎంపీ బండి సంజయ్
కరీంనగర్, వెలుగు : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడడం ఈ తరం చేసుకున్న పుణ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రామ మందిరం కోసం నాటి కరసేవకుల త్యాగాలు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. సోమరం ఆయన కరీంనగర్లోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో రూపొందించిన సైకత అయోధ్య రామ మందిరం వద్ద రామ జ్యోతులు వెలిగించారు. అక్కడి నుంచి తెలంగాణ చౌక్ కు చేరుకుని, బీజేపీ శ్రేణులతో కలిసి పటాకులు కాల్చి, సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్మీడియాతో మాట్లాడుతూ.. రాముడి ప్రాణప్రతిష్ఠను వ్యతిరేకించే వాళ్లు అసలు ఈ దేశ పౌరులేనా? అని ప్రశ్నించారు. సాక్షాత్తు సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిన తర్వాత ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి హిందువుల ఐదు శతాబ్దాల కోరికను నెరవేర్చిన ప్రధాని నరేంద్రమోదీకి హ్యాట్సాఫ్ అన్నారు. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ మోదీ చేతుల మీదుగా జరగడం సంతోషకరమని చెప్పారు. నాడు అయోధ్యలో కరసేవకులను కాల్చి చంపిన ఘటనలు, కళ్ల ముందు మెదులుతున్నాయన్నారు. అయోధ్యలో పాత కట్టడం కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల తొలి బ్యాచ్ తమదేనని, తనతోపాటు గుజ్జ శ్రీనివాస్ సహా ఎంతో మంది తిండికి లేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేసుకున్నారు. రాహుల్ గాంధీ అసోంలో చేసిన ధర్నా పెద్ద డ్రామా అని, అయోధ్య మహత్కార్యాన్ని దారి మళ్లించేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.