నా కెరీర్‌‌‌‌లోనే ఇది బిజీయెస్ట్ ఇయర్

నా కెరీర్‌‌‌‌లోనే ఇది బిజీయెస్ట్ ఇయర్

తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపుకు గర్వకారణంగా ఉందని,  ఇలాంటి పరిశ్రమలో తాను  విభిన్న పాత్రలతో  ప్రేక్షకులని అలరించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు నరేష్​. సోమవారం ఆయన బర్త్‌‌డే. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి నరేష్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో హిట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. 

అనిల్ రావిపూడి నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్‌‌లో దిల్ రాజు గారి నిర్మాణంలో చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ విని ఆనందంగా అనిపించింది. ఇందులో నేను  చేసిన చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ ఏడాది బిగ్ సక్సెస్‌‌తో స్టార్ట్ అయిన నా కెరీర్ మరిన్ని  సూపర్ హిట్స్‌‌తో కొనసాగాలని కోరుకుంటున్నా. నా కెరీర్‌‌‌‌లోనే ఇది బిజీయెస్ట్ ఇయర్.  

తొమ్మిది సినిమాలు ఏకకాలంలో షూటింగ్‌‌లో  ఉన్నాయి. వీటిలో రెండు లీడ్ రోల్స్ చేస్తున్నా.  ఇక  -సినీ పరిశ్రమలో సక్సెస్‌‌ఫుల్‌‌గా 52 సంవత్సరాలు  పూర్తి చేసుకున్నా.  ఈ జర్నీకి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.  అలాగే -సమాజం నాకు ఎంతో ఇచ్చింది. సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలు తీసుకున్నా. సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీనిని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి గారి పేరుతో ప్రారంభించాం. అందులో విజయ కృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  

జంధ్యాల గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు నా గురువులు.  నాకు సినిమాల్లో ఓనమాలు దిద్దించిన జంధ్యాల గారి పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ థియేటర్ ప్రారంభించడం జరిగింది. మరోవైపు  -ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయ కృష్ణ అవార్డ్‌‌ని అభిమానుల సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం.  ఇక  -అమ్మ విజయ నిర్మల గారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది రాయగలిగితే నేనే  రాయగలుగుతాను. అలాగే చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలకి పార్ట్ 2 చేయాలని ఉంది’ అని అన్నారు. 


ఇదే వేదికపై పద్మ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్.  46 చిత్రాలను తెరకెక్కించిన ఏకైక మహిళ దర్శకురాలిగా తన తల్లి  విజయ నిర్మల రికార్డు సృష్టించారని,  ఆమెకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం దక్కలేదని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అర్హత కలిగిన వాళ్లు ఉన్నారని, వారికి పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష  చేసినా తప్పులేదని అన్నారు.