మహిళలు తక్కువ వడ్డీకి హోం లోన్​ పొందడం ఇలా..

మహిళలు తక్కువ వడ్డీకి హోం లోన్​ పొందడం ఇలా..

న్యూఢిల్లీ :  ఇంటిని సొంతం చేసుకోవడం జీవితంలో ముఖ్యమైన మైలురాయి.  మార్చి 2024లో అనరాక్ చేసిన సర్వే ప్రకారం, 60శాతం మంది మహిళలు ఇప్పుడు సొంత ఇంటిని ప్రాధాన్య పెట్టుబడి ఆస్తిగా చూస్తున్నారు. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ, మహిళా రుణగ్రహీతలు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తారని, వారి ఆర్థిక బాధ్యతలకు బాధ్యత వహిస్తారని తాజా పోకడలు సూచిస్తున్నాయి. శాలరీడ్​ ఉమెన్​ కోసం లెండర్లు ప్రత్యేక ఆఫర్లతో ముందుకు వస్తున్నారు. 

మహిళలు తమ జీవిత భాగస్వామి లేదా మరొక కుటుంబ సభ్యునితో కలిసి సహ-–దరఖాస్తుదారుగా నమోదు చేసుకుంటే మెరుగైన ఎల్టీవీ (లోన్ టు వాల్యూ) కోసం అర్హులవుతారు. దీని వలన తక్కువ డౌన్ పేమెంట్ సౌలభ్యం కలుగుతుంది. వడ్డీరేట్లూ తక్కువగా ఉండొచ్చు.  సెక్షన్ 80 సి కింద చెల్లించిన ప్రిన్సిపాల్‌‌ మొత్తంపై రూ. 1.5 లక్షల వరకు,  చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ఆదాయపు పన్ను బెనిఫిట్‌‌గా క్లెయిమ్ చేయవచ్చు.  

ఈ జాగ్రత్తలు పాటించండి..

 టైం ఈజ్ మనీ అనే సూక్తి ఎప్పుడైనా విన్నారా? లోన్ల విషయంలో ఇది కచ్చితంగా వర్తిస్తుంది. సుదీర్ఘ కాలంలో అయితే మీరు మీ బ్యాంకుకు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.  భారీ మొత్తం డౌన్ పేమెంట్ చేయడం తెలివైన నిర్ణయం. దీనివల్ల వడ్డీభారం తగ్గవచ్చు. ఎంత చిన్నమొత్తంలోనైనా ముందస్తు చెల్లింపులు చేయడం మంచిది.  లోన్ ను ముందస్తుగా తీరుస్తున్నందుకు తక్కువ వడ్డీకి ఇది వీలు కల్పిస్తుంది. కొన్ని సంస్థలు ఆటో ప్రీపే, ఆటో డెబిట్ సౌకర్యాలను కూడా అందిస్తాయి. వాటిని వాడుకోవాలి. మీరు నెలవారీగా సెట్ చేసిన మొత్తం చెల్లించిన తర్వాత, మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీ ఖాతా నుంచి రూ.1000 లాంటి చిన్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు వీలు కల్పించే సర్వీస్ ఇది. ఈ చిన్న మొత్తమే మీరు లక్షలను ఆదా చేయడంలో సహాయపడవచ్చు. 

ఇదీ ఫార్ములా..

ఉదాహరణకు.. పూజ 20 సంవత్సరాలకు 10శాతం వడ్డీ రేటుతో రూ.10,00,000 లోన్​ తీసుకుంటుంది. ఈఎంఐని లెక్కించడానికి ఫార్ములా పీ × ఆర్​ × (1 + ఆర్​)ఎన్​/((1 + ఆర్​)ఎన్​–1). ఈ లెక్క ప్రకారం పూజకు ఈఎంఐ రూ.9,650 అవుతుంది. ఇందులో అసలు రూ.1,317 కాగా, మిగిలిన మొత్తం రూ. 8,333 వడ్డీ అవుతుంది. నెలలు గడిచేకొద్దీ ఈఎంఐ అలాగే ఉంటుంది.  మీరు మీ అసలు కంటే ఎక్కువగా తిరిగి చెల్లించే కొద్దీ వడ్డీ  తగ్గుతుంది.  ఆమె ప్రతి నెల రూ.1000 ప్రీపేమెంట్‌‌ని ఏంచుకుంటే, ఆమె తన లోన్‌‌ను 184 నెలల్లో తీర్చగలుగుతుంది. దీనివల్ల రూ.3,58,494 వడ్డీ ఆదా అవుతుంది. 

గౌరవ్ మొహతా, సీఎంఒ హోమ్ ఫస్ట్